అనకాపల్లి : అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. చింతకాయల రాజేశ్‌ను కూడా అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేతలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం ఉన్న నేపథ్యంలో నోటీసులు ఇచ్చి ఆయనను అరెస్టు చేశారు. ఏలూరు కోర్టులో అయ్యన్నను హాజరుపరుస్తామని సీఐడీ పోలీసులు తెలిపారు. అయ్యన్నపాత్రుడిపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి పోలీసులు అయ్యన్న పాత్రుడి ఇంటిలోనికి ప్రవేశించారు. అర్ధరాత్రి అయ్యన్నఇంట్లోకి పోలీసుల ప్రవేశంపై స్థానికులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో పోలీసులు కుటుంబసభ్యులు, స్థానికుల నుంచి ఫోన్లు తీసుకున్నారు. తన భర్త, కుమారుడికి ప్రాణహాని ఉందన్న అయ్యన్న భార్య పద్మావతి పేర్కొన్నారు. మరోవైపు అయ్యన్న అరెస్టును మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా ఖండించారు.
బిసి నేత అయ్యన్న కుటుంబంపై అంత కక్షెందుకు?
మాజీ మంత్రి, బీసీ నేత అయ్యన్న పాత్రుడు, కుమారుడు రాజేష్ ల అరెస్టులను ఖండించిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : బిసి నేత అయ్యన్న కుటుంబంపై అంత కక్షెందుకు? అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గోడలు దూకి, తలుపులు పగల గొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బిసి నేత అయ్యన్న పాత్రుడి ని, కుమారుడిని అరెస్టు చెయ్యడం పట్ల దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. అధికారంలో వచ్చిన నాటినుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోందని, ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారని అన్నారు. నాడు ఇంటి నిర్మాణాలు కూల్చి వేత మొదలు అయ్యన్న కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సిఐడి విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదని అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడు, రాజేష్ లను విడుదల చేయాలని డిమాండ్ చంద్రబాబు చేశారు.
అయ్యన్న అరెస్ట్‌ను ఖండిస్తున్నాం : గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌ను ఖండిస్తున్నామని గంటా శ్రీనివాసరావు ట్విట్టర్లో పేర్కొన్నారు. అయ్యన్న అరెస్టు విషయంలో కనీసం ప్రోటోకాల్ లేకుండా అరెస్ట్ చేసిన విధానం అభ్యంతరకరమని అన్నారు. ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ మంత్రులు ఈ ఘటనపై నోరు విప్పరేం?.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు
అమరావతి : ‘‘ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడమేనా అయ్యన్న చేసిన తప్పా?. వైసీపీలో సిగ్గులేని బీసీ మంత్రులు ఈ ఘటనపై నోరు విప్పరేం?. ’’ అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ప్రశ్నల వర్షం కురిపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ అయ్యన్న పాత్రున్ని అరెస్ట్ చేసిన తీరు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీకి నిదర్శనమని మండిపడ్డారు.
అది అక్రమ అరెస్టు: మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
అనంతపురం : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్యాయంగా గతంలో ఇంటి ప్రహరిని కూల్చేసిన పోలీసులు ఈరోజు ఆయన కుమారుడు రాజేష్‌తోపాటు అయ్యన్నను రాత్రి వేళ బలవంతంగా తీసుకెళ్లడం చట్టవ్యతిరేకమన్నారు. పోలీసులే దొంగల్లా అర్ధరాత్రి ఇళ్లలో ప్రవేశించడం ఈ పాలనలోనే చూస్తున్నామన్నారు.
ఇది బీసీలపై జరిగిన దాడి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
గుంటూరు : అయ్యన్నపాత్రుడు కుటుంబంపై వైసీపీ నేతలు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడు, రాజేష్ లను సిఐడి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇది బీసీలపై జరిగిన దాడిగా అభివర్ణించారు.