మోడీ అమెరికా పర్యటన తర్వాత అమెరికా కీలక తీర్మానం
పూర్తి ఓటింగ్ కోసం సెనేట్ ఫ్లోర్ కు తీర్మానం
అరుణాచల్ ప్రదేశ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో భాగమన్న సెనేటర్ మెర్క్లీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక అమెరికా పర్యటన తర్వాత మన దేశానికి
అనుకూలంగా అమెరికా కాంగ్రెస్ సెనేటోరియల్ కమిటీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ అంతర్భాగంగా గుర్తిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.
ఈ తీర్మానాన్ని సెనేటర్లు జెఫ్ మెర్క్లీ, బిల్ హాగెర్టీ, టిమ్ కైన్, క్రిస్
వాన్ హోలెన్ గురువారం ప్రవేశపెట్టారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా,
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా
మెక్‌మాన్ రేఖను యునైటెడ్ స్టేట్స్ గుర్తిస్తుందని తీర్మానం పేర్కొంది.
ఇప్పుడీ తీర్మానం పూర్తి ఓటింగ్ కోసం సెనేట్ ఫ్లోర్ కు వెళుతుంది. అరుణాచల్ ను
భారత్ లో అంతర్భాగంగా చూడడంతో పాటు ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన భాగస్వాములతో
సహకారాన్ని పెంపొందించుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు ఆ తీర్మానం పేర్కొంది.
అరుణాచల్ ప్రదేశ్ ను చైనా దక్షిణ టిబెట్ గా పిలుస్తోంది. భారత ప్రభుత్వం
దీనిని వ్యతిరేకిస్తోంది. ఆ రాష్ట్రంతో భారత్ కు విడదీయరాని బంధం ఉందని, ఇది
తమ దేశ అంతర్భాగమని భారత్ చెబుతోంది. ఇక ఇప్పుడీ తీర్మానం అరుణాచల్ ప్రదేశ్
రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో భాగమని ధ్రువీకరిస్తోందని, కానీ చైనాలో భాగం కాదని
సెనేటర్ మెర్క్లీ అన్నారు. ఈ ప్రాంతానికి మరింత మద్దతు, సహాయాన్ని
అందించడానికి అమెరికా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. చైనా విస్తరణ వ్యూహానికి
వ్యతిరేకంగా భారత్ సహా వ్యూహాత్మక భాగస్వాములకు అండగా ఉంటామని హాగెర్టీ
తెలిపారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో – పసిఫిక్ కు
యునైటెడ్ స్టేట్స్ మద్దతు ఇచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడుతుందని
సెనేటర్ కార్నిన్ అన్నారు. భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ ను రిపబ్లిక్ ఆఫ్
ఇండియాలో భాగంగా అమెరికా గుర్తిస్తోందని చెప్పారు. ఈ తీర్మానాన్ని ఆలస్యం
లేకుండా ఆమోదించాలని సహ సెనేటర్లకు విజ్ఞప్తి చేశారు.