బ్యూనోస్ ఎయిర్స్ లో రహదారులన్నీ ప్రజలతో ప్యాకప్
ఒకే చోట 20 లక్షల మంది చేరికతో అంబరాన్నంటిన సంబరాలు
విజయంతో తమ ఆర్థిక కష్టాలను మర్చిపోయిన ప్రజలు
ఫుట్ బాల్ ప్రపంచ విజేతగా అర్జెంటీనా నిలవడంతో, ఆ దేశంలో సంబరాలు
అంబరాన్నంటాయి. ఇసుక వేస్తే రాలనంతగా ప్రజలు సెంట్రల్ బ్యూనోస్ ఎయిర్స్ లోని
ఒబెలిస్క్ వద్ద చేరిపోయారు. సుమారు 20 లక్షల మంది ప్రజలు ఒకే చోట చేరారు.
విజయం తాలూకూ సంబరాల వీడియో ట్విట్టర్ పైకి చేరాయి.
ఫ్రాన్స్-అర్జెంటీనా జట్ల మధ్య చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో అంతిమంగా
విజయం అర్జెంటీనాను వరించడం తెలిసిందే. ‘‘ఇది ప్రతి ఒక్కరికీ సంతోషకరం. ఈ రోజు
మా వంతు వచ్చింది. ఆనందం మాది’’ అని డీ మాయో స్వేర్ కు చెందిన ఓ హోటల్
రిసెప్షనిస్ట్ పేర్కొన్నారు. ఈ విజయంతో అర్జెంటీనా ప్రజలు తమ ఆర్థిక కష్టాలను
కొన్ని రోజుల పాటు అయినా మార్చిపోతారనే చెప్పుకోవాలి. ఎన్నో ఏళ్లుగా
పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో, పడిపోతున్న కరెన్సీ విలువతో అర్జెంటీనా ఆర్థిక
కష్టాలను చవిచూస్తోంది. దేశంలోని 4.5 కోట్ల ప్రజల్లో 40 శాతం మంది పేదరికంలో
ఉన్నవారే. ఆర్థికంగా దేశం ఎన్నో కష్టాలను చూస్తోందని, నెలాఖర్లో అవసరాలు తీరడం
కష్టంగా ఉంటుందని ఓ నిర్మాణ రంగ కార్మికుడు పేర్కొనడం గమనార్హం. కానీ, తాము
బాధపడిన ప్రతిదానికీ ఈ విజయం ప్రతిఫలాన్నిచ్చిందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.