వెలగపూడి : వ్యవసాయానికి అండగా నిలవడం, రైతులకు చేయూత నివ్వడంలో సీఎం వైయస్
జగన్ అందరి కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ,
శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
శాసనసభ సమావేశాల్లో శుక్రవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రంలోని
రైతులకు వైయస్ఆర్ జలకళ పథకం ద్వారా అందిస్తున్న కార్యక్రమాల ప్రగతిపై సభకు
వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ఆర్ జలకళ కింద కమాండ్ ఏరియాతో
పాటు నాన్-కమాండ్ ఏరియాలో కూడా అర్హులైన రైతులకు ప్రభుత్వం ఉచితంగా బోర్
బావులను మంజూరు చేస్తోంది. అంతేకాదు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్
ఉపకరణలతో పాటు 180 మీటర్ల కేబుల్ ను కూడా రైతులకు ఉచితంగానే అందచేస్తున్నాం.
ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఇప్పటి వరకు వచ్చిన మొత్తం దరఖాస్తులు 2,28,421
అయితే దానిలో సచివాలయాల్లో విఆర్వోలు ఆమోదించినవి 1,88,571 దరఖాస్తులు. భూగర్భ
జలశాఖ సర్వే పూర్తి చేసినవి 66,190 దరఖాస్తులు. వీటిల్లో కలెక్టర్లు 42,388
దరఖాస్తులకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు.
ఈ పథకం కింద మంజూరు చేసిన బోరుబావులకు ఉచితంగానే
విద్యుదీకరణ చేస్తున్నాం. ఇలా ఉచితంగా విద్యుదీకరణ
చేసినవి 1721, దీనికి చేసిన వ్యయం రూ.54.95 కోట్లు అని తెలిపారు. గత ప్రభుత్వం
ఎన్టీఆర్ జలసిరి పేరుతో రైతులకు ఉచిత బోరు బావులను మంజూరు చేసింది. అయితే ఇది
కేవలం కమాండ్ ఏరియాల్లో మాత్రమే అమలు చేశారని, అదికూడా కేవలం రెండు వందల
అడుగులు వరకు మాత్రమే డ్రిల్లింగ్ కు అవకాశం కల్పించారన్నారు. గత అయిదేళ్ళలో
తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు మంజూరు చేసిన బోరుబావులు కేవలం 33,116
మాత్రమేనాని, ఇందుకోసం గత ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయం కేవలం రూ.99.35 కోట్లు
మాత్రమే అని, అలాగే రైతులు చేసుకున్న దరఖాస్తులు ఆయా మండలాల్లో ఎంపిడిఓల
ద్వారా మాత్రమే మంజూరు చేశారని, అదికూడా మొదటి వచ్చిన దరఖాస్తుకు మొదటి
ప్రాధాన్యత అనే విధానంను అమలు చేశారని చెప్పారు.
సీఎం జగన్ మాత్రం అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు వైయస్ఆర్ జలకళ కింద
బోరుబావులను మంజూరు చేసేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకున్నారు. కమాండ్ ఏరియాతో
పాటు నాన్ కమాండ్ ఏరియాలోనూ బోరు బావులను మంజూరు చేస్తున్నాం. జియాలజిస్ట్ లు
ఎంత లోతు వరకు సిఫారస్ చేస్తే అంత వరకు డ్రిల్లింగ్ చేయిస్తున్నాం. ఇప్పటి
వరకు విద్యుత్ శాఖ ద్వారా 1.21 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్ లను ఇచ్చాం. మరో
నాలుగు వేల కనెక్షన్ లకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నెలాఖరు
నాటికి వాటికి కూడా కనెక్షన్ లను ఇవ్వబోతున్నాం. ఈ ప్రభుత్వం రైతుపక్షపాతి అని
మరోసారి చాటుకుంటోందని పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి పేర్కొన్నారు.