కైకలూరు నియోజకవర్గ సమీక్షలో పాల్గోన్న జిల్లా ఇంఛార్జి మంత్రి పినిపే
విశ్వరూప్
ఏలూరు : పేద ప్రజలకు మంచి జరగడమే మన రాష్ట్ర ప్రభుత్వ విధానమని రాష్ట్ర రవాణా
శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు కలెక్టరేట్
లోని గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం కైకలూరు శాసనసభ నియోజకవర్గంలో అమలు
జరుగుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను శాసన సభ్యులు దూలం
నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి.
లావణ్యవేణి, కైకలూరు నియోజకవర్గం లోని ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి
సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంచార్జి మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ
అధికారులు, ప్రజా ప్రతినిధులు సమీష్టి కృషితో బాధ్యతీయుత పరిపాలన
అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా ప్రాధాన్యతా
కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షకు ఇది చక్కటి పరిష్కారమన్నారు. నియోజకవర్గ
సమీక్ష సమావేశంలో స్ధానిక శాసన సభ్యులు, స్ధానిక ప్రజాప్రతినిధులు లేవనేత్తిన
జిల్లాస్ధాయిలో పరిష్కరింపబడే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు
తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పేదప్రజల జీవన ప్రమాణాల స్థాయిని మెరుగు
పరిచేందుకు నవరత్నాల కార్యక్రమం ద్వారా విన్నూత్న రీతిలో ఎన్నో సంక్షేమ
పధకాలను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు.
వాటిని అర్హులైన పేదలందరికీ అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
పేదలందరికీ ఇళ్ళు పధకంలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి
లబ్దిదారులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను కూడా తెలుసుకుని వాటిని
పరిష్కరించడం ద్వారా ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. కైకలూరు
నియోజకవర్గంలో మంజూరైన 79 గ్రామ సచివాలయ భవనాలు, 45 రైతు భరోసా కేంద్రాలు,
57 వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులనుల్లో ఇప్పటికే కొన్ని
పూర్తయ్యాయని మిగిలిన వాటిని సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తిచేయాలని అధికారులను
మంత్రి ఆదేశించారు.
శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ కైకలూరులోని యంపిడిఓ కార్యాలయం
ఎదురుగా ఉన్న స్ధలంలో అంభేద్కర్ భవనం నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు
మంజురుకు చర్యలు తీసుకోవాలని ఇంఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్ ను కోరారు.
ఇప్పటికే ఇందుకోసం ఏలూరు పార్లమెంటు సభ్యులు రూ. 30 లక్షల మంజూరు
చేశారన్నారు. కైకలూరు సిహెచ్ సిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు
తీసుకోవాలన్నారు. ముదినేపల్లి, కైకలూరు తదితర ప్రాంతాల్లో కొండదొరలు
శ్రీకాకుళం నుంచి కూలిపనికోసం రావడం జరిగిందని వారికి ఎస్టీ కుల ధృవీకరణ
పత్రాలు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే దీనిపై జిల్లా కలెక్టర్
వారు కమిటీ కుడా వేయడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 27
సొసైటీలకు కమీషన్ విడుదల చేయవలసిందిని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
నియోజకవర్గంలో ఎస్సీ ఏరియాల్లో స్మశాన వాటికలకు కైకలూరు నియోజకవర్గం పరిధిలో
భూమి కేటాయించాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. భూమి రీ సర్వేపై కొంతమంది
కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ మంచి ఉద్దేశ్యంతో
ఎంతో ధైర్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నూరు సంవత్సరాల తర్వాత భూమి రీ సర్వేను
చేపట్టారన్నారు. దీనికి రైతులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.
22ఎ కి సంబంధించి సత్వర పరిష్కారం చూపవలసిన అవసరం ఉందని తద్వారా
రిజిష్ట్రేషన్లుకు సులభతరం అవుతుందని దీనివలన ఎక్కువగా పేదవారికి
లబ్దిచేకూరుతుందన్నారు. నియోజకవర్గంలో శిధిలావస్ధకు చేరుకున్న 10 పశువుల
ఆసుపత్రులను పునరుద్దరించవలసిన అవసరం ఉందని ఇందుకు సుమారు రూ. 4 కోట్లతో
ప్రతిపాధనలు సిద్దం చేయడం జరిగిందని ఇందుకు నిధులు విడుదలకు చర్యలు
తీసుకోవాలని ఇంచార్జి మంత్రిని ఆయన కోరారు.
జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు మేరకు
ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలు సెప్టెంబరు 30 కల్లా పూర్తిచేయవలసిన అవసరం ఉందని
ఇందుకు స్ధానిక శాసన సభ్యుల సహకారం కూడా ఎంతో అవసరం అన్నారు. ఈ భవనాల
నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రితోపాటు బిల్లులు త్వరితగతిన చెల్లింపులు
కూడా ప్రభుత్వం చేస్తున్నదన్నారు. కైకలూరు నియోజకవర్గంలో పేదలకు ఇళ్లు
నిర్మాణంలో జగనన్న గ్రీని విలేజ్ స్ధానిక శాసన సభ్యులు ప్రత్యేకమైన శ్రధ్ద
చూపతున్నారన్నారు. ఇప్పటికే 300 ఇళ్లు పూర్తిచేయడం జరిగిందని మరో 800 ఇళ్లు
నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ లేఅవుట్ లో మౌలిక సదుపాయాలు
కల్పించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలోని 4
మండలాల్లో 101 గ్రామాలకు గాను 91 గ్రామాల్లో ఓఆర్ఐ మ్యాప్స్ రావడం జరిగిందని,
19 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందన్నారు. 48 గ్రామాల్లో 13
నోటిఫికేషన్ పూర్తయిందన్నారు. 47 గ్రామాల్లో తుది ఆర్ఓఆర్ పూర్తయిందన్నారు.
పేదలందరికీ ఇళ్ళు పధకం కింద ఫేజ్-1 మరియు 90 రోజుల్లో ఇళ్ల స్ధలాలు పంపిణీలో
భాగంగా ఇప్పటి వరకు 9వేల 985 మందికి ఇళ్ల స్ధల పట్టాలు పంపిణీ చేశామన్నారు.
ఇళ్ల స్ధలాల పంపిణీకి 5 వేల 115 మందికి ప్రభుత్వ భూమి, 4870 మందికి భూసేకరణ
చేసి ఇళ్ల స్ధలాలు ఇవ్వడం జరిగిందన్నారు.సమావేశంలో ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ,
డిఆర్ఓ ఎవిఎన్ఎస్ మూర్తి, ఏలూరు ఆర్డిఓ కె. పెంచల కిషోర్, డి ఆర్ డి ఏ పీడీ
విజయరాజు, యంపిపిలు చందన ఉమామహేశ్వరరావు, అడవి వెంకటకృష్ణమోహన్, పెద్దిరెడ్డి
శ్రీరామ దుర్గాప్రసాద్, రామిశెట్టి వివి సత్యనారాయణ, జడ్పిటిసి ముంగర
విజయనిర్మలా, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు, జిల్లా వ్యవసాయశాఖాధికారి
వై. రామకృష్ణ, డియంహెచ్ఓ డా. డి. ఆశ, వివిధ శాఖల అధికారులు, కైకలూరు
నియోజకవర్గంలోని మండలాల జెడ్పిటిసి లు, ఎంపిపి లు, తహసీల్దార్లు, ఎంపిడిఓ లు,
ఎంపిటిసి, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.