జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమం వల్ల
పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ
మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కొవ్వూరు
పట్టణంలోని ఔరంగాబాద్ సచివాలయ పరిధిలోని 14, 15, 16 వార్డులకు నిర్వహించిన
జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం
ద్వారా ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న 1261 మందికి సంబంధిత పత్రాలను
హోంమంత్రి అందజేశారు. సర్టిఫికేట్ సేవలు కాకుండా ఇతర సమస్యలపై స్థానిక ప్రజల
నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. చిన్న చిన్న సమస్యలను వెంటనే
పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ముందుగా ఔరంగాబాద్ లోని
బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని
ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్
రెడ్డి ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 11 రకాల సర్టిఫికెట్లు మీ ఇంటికే తలుపు తట్టి
ఇస్తున్నారని.. అలాగే ప్రతి ప్రభుత్వ సంక్షేమం పథకం కూడా నేరుగా మీ ఇంటికే
వచ్చి చిరునవ్వుతో సేవలు అందిస్తున్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని
విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ 11 రకాల సర్టిఫికెట్లను అప్పటికప్పుడే
పంపిణీ చేయడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. గతంలో ఏ సర్టిఫికెట్ తీసుకోవాలన్న
రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండేదని, ప్రజల కష్టాలు తెలుసుకున్న
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ప్రజలు కూడా
సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 99 శాతం మంది
అర్హులకు పథకాలు అందుతున్నాయని, మిగిలిన ఒక్క శాతం అర్హులకు కూడా జగనన్న
సురక్ష పథకం ద్వారా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని
హోంమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,
నియోజకవర్గ నాయకులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు
తదితరులు పాల్గొన్నారు.