పాల్గొన్న హోం మంత్రి తానేటి వనిత
కొవ్వూరు : అర్హులైన ప్రతి ఒక్కరికి నూరు శాతం పథకాలు అందించాలనే లక్ష్యంతో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషిచేస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి,
విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. ఇప్పటికే
రాష్ట్రంలో 99 శాతం మంది అర్హులకు పథకాలు అందుతున్నాయని, మిగిలిన ఒక్క శాతం
అర్హులకు కూడా జగనన్న సురక్ష పథకం ద్వారా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
తీసుకుంటుందన్నారు. బుధవారం కొవ్వూరు నియోజకవర్గంలో చాగల్లు మండలం
బ్రాహ్మణగూడెంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా
పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 11 ఉచిత సేవలకు సంబంధించిన 2051 ధృవపత్రాలను
లబ్ధిదారులకు హోంమంత్రి తానేటి వనిత స్వయంగా అందించారు. ఈ సందర్బంగా హోంమంత్రి
తానేటి వనిత మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి
మరిన్ని సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారన్నారు. ప్రతి
గ్రామంలోనూ ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతున్నాయని.. చిన్న చిన్న కారణాల వలన,
సాంకేతిక లోపం వలన, పథకాలపై పూర్తి అవగాహన లేకపోవడం వలన లబ్ది చేకూరని పక్షంలో
జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మిగిలిన కుటుంబాలకు కూడా లబ్ది చేకూరుతుందని
తెలిపారు. అలాగే పథకాల అమలుకు అవసరమైన టీములను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో
ప్రజలకు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ ప్రత్యేక
క్యాంపుల ద్వారా సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్ కార్డు
డివిజన్, హౌస్ హోల్డ్ డివిజన్, ఆదాయం) మొదలైన 11 రకాల ధ్రువీకరణ పత్రాలు
సర్వీస్ ఛార్జ్ లేకుండా ఉచితంగా అందిస్తున్నామన్నారు. వాలంటీర్లు, సచివాలయ
సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కూడిన టీమ్ నియోజకవర్గంలో ప్రతి
ఇంటినీ సందర్శిస్తుందని అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని
గుర్తించి సమస్య పరిష్కారానికి కావల్సిన పత్రాలు సేకరిస్తారని, ఈ దరఖాస్తులను
సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ నమోదు చేసుకుని టోకెన్ నంబర్, సర్వీస్
రిక్వెస్ట్ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారని
హోంమంత్రి వివరించారు. జగనన్న సురక్షా కార్యక్రమంలో నేరుగా ప్రజల వద్దకు
వెళ్తామని, నోరు తెరిచి అడగలేని, పొరపాటున ఎక్కడైనా, ఎవరైనా పథకాలు పొందకుండా
మిగిలిపోయి ఉంటే ఆ అర్హులకు కూడా మంచి చేసే కార్యక్రమే జగనన్న సురక్ష
కార్యక్రమమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ
నాయకులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు
పాల్గొన్నారు.