రాజకీయాల అవసరాల కోసం ‘కులం’ కార్డు వినియోగించొద్దు
గత ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని బూటకపు హామీ ఇచ్చింది
కాపులకు ఎవరి హయాంలో ఎంత సంక్షేమం జరిగిందో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు రెడీ
కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి వెల్లడి
విజయవాడ: రాష్ట్రంలో అవినీతి రహిత, పారదర్శక పాలనను అందిస్తూ సంక్షేమ పథకాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగుతుందని ఏపీ
స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి
(శేషు) తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ
ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కార్పోరేషన్ల ద్వారా అర్హులైన ప్రతి
ఒక్కరికీ కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అవినీతి రహితంగా లబ్ధిదారులకు
నేరుగా అందిస్తున్నామన్నారు. తాడేపల్లిలో కాపు కార్పోరేషన్ కార్యాలయంలో
సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ… ప్రతిపక్షాల రాజకీయ అవసరాల కోసం
‘కులం’ కార్డుని ఉపయోగించవద్దని, గత ప్రభుత్వంలో కాపు ఉద్యమ నేత ముద్రగడను,
కాపు నేతలను అవమానించినప్పుడు ఇప్పుడు దీక్ష చేస్తున్న కాపునేత, వారి వెనుక
ఉన్న నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాపులను పావులుగా ఉపయోగించుకుని
కొంతమంది నాయకులు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో
అధిక సంఖ్యలో ఉన్న కాపు కులాలకు గత ప్రభుత్వంలో అన్యాయం జరుగుతున్నా ఒక్క మాట
కూడా మాట్లాడని వారు.. ఇప్పుడు రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ప్రతిపక్షాలతో
కలిసి కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అగ్రవర్ణ పేదల కోసం ‘ఈబీసీ నేస్తం’, కాపుల కోసం
‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకంతో పాటు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ
పథకాలు అమలు చేస్తూ రాష్ట్రంలో సుభిక్ష పాలన, శాంతియుత పాలనతో కులాలన్నింటినీ
కలుపుతున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరికీ కులం లేదని కేవలం
’సంక్షేమం కులం’ మాత్రమే ఉందన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని బూటకపు
హామీ ఇచ్చి గత ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. కాపులకు ఎవరి హయాంలో ఎంత
సంక్షేమం చేశామో చర్చకు రాష్ట్రంలో ఎక్కడైనా, ఎప్పుడైనా రెడీ అంటూ
ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. 2014 నుండి 2017 వరకూ కాపు కార్పోరేషన్ కు గత
ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని, గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కాపు
సంక్షేమానికి ఖర్చు చేసింది కేవలం రూ.1400 కోట్లు మాత్రమేనని కాపు కార్పోరేషన్
ఛైర్మన్ అడపా శేషు గుర్తుచేశారు.