జగన్ మోహన్ రెడ్డి
అమరావతి : ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వచ్చే ఆరోపణలను పాజిటివ్‌గా తీసుకుందామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఆరోపణల్లో నిజం ఉంటే సరిచేసుకుందామని జిల్లా కలెక్టర్లకు ఆయన సూచించారు. వివిధ కారణాలతో సంక్షేమ పథకాలు అందనివారికి సీఎం నిధులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.79లక్షల మంది లబ్ధిదారులకు రూ.590కోట్ల నిధులు వారి ఖాతాల్లో జమకానున్నాయి. జగనన్న చేదోడు, వైఎస్సార్ మత్స్యకార భరోసా, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి, వైఎస్సార్ కాపునేస్తం సహా పలు పథకాల ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు. ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకూడదన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తమది రైతులు, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమన్నారు. అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మందికి రూ.590.91 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందని వారికి అవకాశం ఇచ్చాం. పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధులు జమ చేస్తున్నాం. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఈ మాదిరిగా సంక్షేమ పథకాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదని సీఎం అన్నారు.