అవయవదానం చేసిన కుటుంబ సభ్యులకు ఘన సత్కారం
జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున
విశాఖపట్నం : ప్రస్తుతం సమాజంలో అవయవదానం కోసం ఎదురుచూస్తున్న రోగులకు సకాలంలో
అవయవాల అందించే విధంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా అవయవ దానంపై అవగాహన కలిగి
ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున కోరారు. ప్రపంచ అవయవదాన
దినోత్సవం సందర్భంగా ఆదివారం గురజాడ కళాక్షేత్రంలో ప్రత్యేకంగా అవగాహన సదస్సు
నిర్వహించడంతోపాటు, అవయవ దానం చేసిన బాధిత కుటుంబ సభ్యులకు ఘన సన్మాన
కార్యక్రమాన్ని విమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా
జిల్లా కలెక్టర్ డా. ఏ. మల్లికార్జున మాట్లాడుతూ వైద్య రంగానికి ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకు నిదర్శనం పదహారేళ్ల
బాలుడికి జీవన్ దాన్ లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్
ఉచితంగా చేశారన్నారు. ప్రజలకు ఉచిత వైద్యం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం
ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. అవయవదానంపై రాష్ట్ర వ్యాప్తంగా గత మూడేళ్లుగా
అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వీటిని గ్రామస్థాయి
నుంచి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా జీవన్ దాన్ కార్యక్రమం ద్వారా అవయవాలు సేకరణ,
అవయవాలు మార్పిడి చేపట్టే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఐదు లక్షల మంది అవయవాల వైఫల్యం ద్వారా
బాధపడుతున్నారని వారిలో కేవలం 10 శాతం మాత్రమే వైద్యం పొంది
జీవిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే రోగులకు అవసరమైన అవయవాలను దానం చేసేందుకు
ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.
రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవదానం
చేసి ట్రాన్స్ ప్లాంటేషన్ చేసిన ఘనత విమ్స్ ఆసుపత్రికి దక్కిందన్నారు. అవయవ
దానంపై భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరింత విస్తృత అవగాహన కల్పించే
విధంగా చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. అవయవ దానం చేసిన కుటుంబ సభ్యులకు
విశాఖ నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో ఉచిత కన్సల్టెన్సీ సేవలతో పాటు, ఆసుపత్రి
ఖర్చులు విషయంలో 50% రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగానే 15
మంది అవయవ దానం చేసిన బాధ్యత కుటుంబ సభ్యులకు ఘన సత్కారం కలెక్టర్
మల్లికార్జున్, డైరెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర
రెడ్ క్రాస్ సంస్థల అధ్యక్షులు డాక్టర్ శివ నాగేందర్ రెడ్డి, జిల్లా వైద్య
ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వర్ రావు, విమ్స్ ఆసుపత్రి వైద్యులు,
నర్సింగ్ సిబ్బంది, పలు కళాశాలలకు చెందిన వైద్య విద్యార్థులు, ఎన్జీవోలు, రెడ్
క్రాస్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.