కొత్త విధానంతోనే పేద రోగులకు మేలు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానంతో అసంక్రమిత వ్యాధులకు చెక్
ఎన్‌హెచ్ ఎం బడ్జెట్లో 5 శాతం అసంక్రమిత వ్యాధుల చికిత్సకి కేటాయించాలి
కేంద్ర మంత్రి మన్సూక్ మాండవీయను ప్రత్యేకంగా కలిసి వివరించిన మంత్రి
విడదల రజిని
గుంటూరు : అవయవమార్పిడి, అవయవ దానాలకు సంబంధించి మన దేశంలో నూతన
విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ
మంత్రి విడదల రజిని తెలిపారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కేంద్ర సమాఖ్య 15వ
కాన్ఫరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం స్వస్థ్య చింతన్ శివిర్ పేరుతో
నిర్వహిస్తోంది. రెండో రోజు శనివారంనాడు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి
విడదల రజిని పలు అంశాలపై మాట్లాడారు. మన దేశంలో అవయవాలు అవసరం ఉన్న
వ్యక్తులు, అందుబాటులో ఉన్న అవయవాల నిష్పత్తిలో చాలా తేడా ఉంటోందన్నారు.
100 మందికి ఏవైనా అవయవాల అవసరం ఉంటే.. కేవలం ఒక్కరికి మాత్రమే
అందుబాటులో ఉంటున్నాయన్నారు. దీనివల్ల అవయవదానం, అవయవమార్పిడి
విషయాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. దీన్ని నివారించాల్సిన
అవసరం ఎంతయినా ఉందన్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం నూతన పాలసీని
తీసుకురావాలన్నారు. దీనివల్ల పేద రోగులకు మేలు చేకూరుతుందని తెలిపారు.
కేంద్ర మంత్రికి ప్రత్యేక వినతి : కాన్ఫరెన్స్ సందర్భంగా మంత్రి విడదల
రజిని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కలిసి పలు
విజ్ఞప్తులు చేశారు. ఆ మేరకు వినతిపత్రం కూడా సమర్పించారు. అసంక్రమిత
వ్యాధుల విషయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఫ్యామిలీ డాక్టర్ వైద్య
విధానం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం 2021 అక్టోబర్‌లో అసంక్రమిత
వ్యాధులపై స్క్రీనింగ్ ప్రారంభించిందని తెలిపారు. బీపీ, షుగర్ రోగులపై
ప్రత్యక్ష పర్యవేక్షణ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం వల్ల
సాధ్యమవుతోందని తెలిపారు. భవిష్యత్తులో ఈ ఫ్యామిలీ డాక్టర్ల
పర్యవేక్షణలోనే క్యాన్సర్, గుండె వ్యాధులకు ముందస్తు పరీక్షలు కూడా
చేయబోతున్నామన్నారు. క్యాన్సర్, గుండె జబ్బుల చికిత్సకు తమ ప్రభుత్వం
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ఏకంగా 600కుపైగా క్యాన్సర్ చికిత్సలను
ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. అందుకోసం ఏటా రూ.600 కోట్లకు పైగా
ఖర్చుచేస్తున్నామన్నారు. కాన్యర్ చికిత్సను బలోపేతం చేసేందుకు రూ.350
కోట్లతో టీచింగ్ ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు, వసతులతో పాటు స్టేట్
క్యాన్సర్ సెంటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. రాష్ట్ర
ప్రభుత్వాలకు ఇది పెనుభారమైనప్పటికీ భరించేందుకు సిద్ధంగా వుందనన్నారు .
కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలు
సులువుగా నెరవేరతాయన్నారు. గుండె జబ్బులకు ఇప్పుడు అందుతున్న వైద్యాన్ని
కూడా మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఎన్ హెచ్ ఎం కింద
ఇస్తున్న నిధుల్లో 5 శాతం ఈ జబ్బుల చికిత్స కోసం కేటాయిస్తే ప్రజలకు మేలు
చేకూరుతుందని కేంద్ర మంత్రికి విన్నవించారు. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా
చేపడుతున్న వైద్య ఆరోగ్య పథకాలు, విధానాలకు కూడా ఎన్ హెచ్ ఎం నుంచి
అదనంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైద్య
ఆరోగ్యశాఖ కేంద్ర మంత్రులు మన్సూక్ మాండవీయ, ఎస్పీసింగ్ భాగేలా, 15
రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్
సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్
తదితరులు పాల్గొన్నారు.