అనంతపురం జిల్లాలో పటిష్టంగా వైసీపీ
కార్యకర్తలకు తప్పకుండా న్యాయం చేస్తాం
బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మాది
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే పథకం ఒక్కటుందా?
జగన్ సీఎం అయ్యాక 98.44 శాతం హామీల అమలు
అనంతపురం నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి
ఎమ్మెల్సీ అభ్యర్థిగా రవీంద్రారెడ్డిని గెలిపించుకుందాం
అనంతపురం నియోజకవర్గ విస్త్రృత స్థాయి సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి
అనంతపురం : తెలుగుదేశం పార్టీ అవసానదశలో ఉందని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్,
జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కానీ
ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని
మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో క్షేత్రస్థాయిలో వైసీపీ పటిష్టంగా ఉంటే
తెలుగుదేశం పార్టీ మాత్రం వైసీపీ రెండు స్థానాల్లో మాత్రమే బాగుందని ఉత్తుత్తి
ప్రచారం చేసుకుంటోందని అన్నారు. నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న విద్యుత్
కళాభారతిలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడి ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా
అధ్యక్షుడు పైలా నర్సింహయ్య అధ్యక్షతన సోమవారం అనంతపురం నియోజకవర్గ వైసీపీ
విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నాలుగు రోజులుగా తాను జిల్లాలో విస్త్రృత స్థాయి
సమావేశాలు నిర్వహిస్తున్నానని, ఎక్కడా కూడా సీఎం జగన్‌పై ప్రేమ తగ్గలేదని
గుర్తించినట్లు చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు
అయ్యారని, కానీ జగన్‌లా పరిపాలన ఎవరూ చేయలేదన్నారు. మూడున్నరేళ్లలోనే ఏకంగా
98.44 శాతం హామీలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదని అన్నారు.
ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని తెలిపారు. సంక్షేమం,
అభివృద్ధి విషయంలో ప్రతిపక్ష పార్టీలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాయని
మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్లు కరోనాతో సరిపోయిందని, కానీ
ఆ సమయంలో కూడా సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపలేదని స్పష్టం చేశారు. 2014లో
చంద్రబాబు ఇచ్చిన అపద్దపు హామీలను నమ్మి ప్రజలు టీడీపీని గెలిపించారని
తెలిపారు. 600 హామీలు.. 100 పేజీల మేనిఫెస్టోను ప్రకటించిన చంద్రబాబు, చివరకు
మేనిఫెస్టో కన్పించకుండా చేశారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకం, కార్యక్రమం అయినా ఉందా? అని
ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెబితే ఆరోగ్యశ్రీ గుర్తుకు
వస్తుందని, జగన్ పేరు చెబితే నవరత్నాలు గుర్తుకు వస్తాయన్నారు. చంద్రబాబు తన
పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. వైసీపీ అధికారంలోకి
వచ్చాక కష్టపడి పని చేసిన కార్యకర్తలకు న్యాయం జరిగిందని, ఇంకా చాలా మందికి
న్యాయం చేయాల్సి ఉందని చెప్పారు. తప్పకుండా ప్రతి ఒక్కరికీ భవిష్యత్‌లో న్యాయం
జరుగుతుందని అన్నారు. బీసీ మహాసభ పెడితే రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మందికి పైగా
బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ బీసీలను
అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఆ వర్గాలకు
చంద్రబాబు చేసిన మేలు ఏదీ లేదన్నారు. రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత
వైఎస్ జగన్మోహన్రెడ్డిదని అన్నారు. అనంతపురం నియోజకవర్గంలో ఎక్కడా లేని
విధంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని, సీఎం జగన్‌ను
ప్రతి ఒక్కరూ ఆదరించి..అభిమానించి..ఆశీర్వదించాలని కోరారు. పట్టభద్రుల
ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలిపించుకుందామని తెలిపారు.