ప్రతీ సచివాలయంలోనూ క్యాంప్ నిర్వహణ
దీనికోసం 1902 హెల్ప్‌డెస్క్ కూడా ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజుల పాటు
నిర్వహించే *జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుండి లాంఛనంగా
ప్రారంభించిన ముఖ్యమంత్రి
గుంటూరు : రేషన్ కార్డులు, పెన్షన్ల కోసమే గతంలో ఉద్యమాలు జరిగేవని, అలాంటిది
తాము ఎలాంటి వివక్ష లేకుండా పౌర సేవలు అందించ గలుగుతున్నామని ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. అయితే ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ
అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ‘జగనన్న సురక్ష’
కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ ‘‘ఎక్కడా లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేలు అర్హులందరికీ అందాలి. వివిధ కారణాలతో మిగిలిన
లబ్ధిదారులకు మంచి చేయడమే జగనన్న సురక్ష తీసుకొచ్చాం. అర్హత ఉండి కూడా
చిన్నచిన్న కారణాల వల్ల మిగిలిపోయిన వాళ్లకు లబ్ధి చేకూరుస్తామని ఈ సందర్భంగా
ఆయన స్పష్టం చేశారు.
‘‘నవరత్నాల ద్వారా రూ.2 లక్షల 16వేల కోట్లు అందించాం. నేరుగా బటన్ నొక్కి
అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేశాం. పేదవాడికి మంచి జరగాలన్నదే ప్రభుత్వ
సంకల్పం. పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. లంచాలకు
తావులేకుండా 600 రకాల పౌర సేవలు అందిస్తున్నాం. ఈ నాలుగేళ్లలో గ్రామస్వరాజ్యం
తీసుకొచ్చాం. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు సీఎం జగన్
స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో
నెలరోజులపాటు ‘జగనన్నకి చెబుదాం’ కార్యక్రమానికి కొనసాగింపుగా జగనన్న సురక్ష
కార్యక్రమం జరగనుంది. ప్రతీ సచివాలయంలోనూ క్యాంప్ నిర్వహించేలా ఏర్పాటు
చేశారు. దీనికోసం 1902 హెల్ప్‌డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. సమస్యలేవైనా ఉంటే
ఈ నెంబర్‌కు డయల్ చేయొచ్చు.
ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి
ముత్యాలనాయుడు, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యాశాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్
డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి,
గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వ్యవసాయ, సహకారశాఖ స్పెషల్
సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ
కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్,
గృహనిర్మాణశాఖ ఎండి జి లక్ష్మీషా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి
కోటేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి,
గ్రామ, వార్డు సచివాలయాలశాఖ అదనపు డైరెక్టర్ భావన, ఇతర ఉన్నతాధికారులు
హాజరయ్యారు.