వియన్నా: భారత్‌లోకి ఉగ్రవాదులను ఎగ దోస్తూ, ఉగ్రవాదాన్ని విస్తరింపజేస్తున్న
పాకిస్తాన్‌పై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్
సమర్థించుకున్నారు. ఆస్ట్రియా జాతీయ వార్తాప్రసార సంస్థ ఓఆర్‌ఎఫ్‌కు సోమవారం
ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ పలు అంశాలు మాట్లాడారు. ప్రపంచ ఉగ్రవాదానికి
కేంద్రస్థానం పాక్‌లో ఉందని మీరు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ఒక
భారతీయ దౌత్యవేత్త హోదాలో సమర్థించుకుంటారా అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు
జైశంకర్ బదులిచ్చారు.
‘భారత పార్లమెంట్‌పై దాడి, ముంబై వంటి నగరాల్లో దాడి చేసి భారతీయులను, విదేశీ
పర్యాటకులను చంపి, రోజూ సరిహద్దు గుండా ఉగ్రవాదుల చొరబాట్లకు ప్రయత్నించే
పాక్‌నుద్దేశించి ఇంకా ఏమనాలి? ఇంకాస్త పరుష పదం వాడితే బాగుండేది.
ఉగ్రవాదానికి కేంద్రస్థానం అనే పదం మంచిదే’ అని వ్యాఖ్యానించారు. ‘పట్టపగలే
నగరాల్లో ఉగ్రవాదులకు సైన్యం తరహాలో యుద్ధతంత్రాలు నేర్పిస్తున్నారు. ఈ
విపరీతాలను యూరప్ దేశాలు ఎందుకు నిలదీయవు? భారత్, పాక్ మధ్య మళ్లీ యుద్ధం
వస్తుందేమోననే భయం ప్రపంచానికి ఉంటే ముందుగా ఉగ్రవాదంపై ప్రపంచదేశాలు
దృష్టిపెట్టాలని హితవు పలికారు.