బీసీ కుల జనగణన తీర్మానాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు వెల్లడి
బడుగు, బలహీన వర్గాలకు నిధులు, విధులు ఇచ్చే విధంగా మొట్టమొదటి అడుగు పడింది
కాంగ్రెస్తో సమానంగా బీఆర్ఎస్కు శాసన సభలో సమయం ఇచ్చామన్న శ్రీధర్ బాబు
హైదరాబాద్ : ఈ అసెంబ్లీ సమావేశాల్లో మూడు కీలక బిల్లులను ఆమోదించుకున్నట్లు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నీటి పారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసి చర్చ నిర్వహించింది. ఆ తర్వాత స్పీకర్ శాసన సభను నిరవధికంగా వాయిదా వేశారు. అనంతరం శ్రీధర్ బాబు శాసన సభకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. ప్రతిపక్ష పార్టీ ఏం చేసినా తాము నిర్మాణాత్మకంగా వ్యవహరించామన్నారు. మూడు కీలక బిల్లుల్లో భాగంగా బీసీ కుల జనగణన తీర్మానాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. చరిత్రలో నిలిచే ఘట్టం ఈ సమావేశాల్లో జరిగిందని, కులగణన చేపట్టి సంఖ్యాపరంగా అవకాశాలు కల్పించే బాధ్యతను తాము తీసుకున్నామన్నారు. తద్వారా బడుగు, బలహీన వర్గాలకు నిధులు, విధులు ఇచ్చే విధంగా మొట్టమొదటి అడుగు పడిందన్నారు. సమయం వృథా కాకుండా సభను నడిపించే ప్రయత్నం చేశామన్నారు. చర్చల్లో 59 మంది సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరిగిందన్నారు. 45 గంటల 32 నిమిషాల పాటు శాసన సభ జరిగినట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో అధికార కాంగ్రెస్తో సమానంగా బీఆర్ఎస్కు దాదాపు సమాన సమయం ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 8 గంటల 43 నిమిషాల సమయం కేటాయిస్తే, బీఆర్ఎస్కు 8 గంటల 41 నిమిషాలు, బీజేపీకి 3 గంటల 48 నిమిషాలు, మజ్లిస్ పార్టీకి 5 గంటలు, సీపీఐకి 2 గంటల 55 నిమిషాల సమయం ఇచ్చినట్లు చెప్పారు.