దేవాదాయ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు
అర్చకులకు నో రిటైర్మెంట్
విశాఖ భూముల అక్రమాలపై సిట్ రిపోర్టుకు ఆమోదం
రైతులకు, దళితులకు, ఆర్చకులకు తీపి కబురు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ
జులై నెలలో చేపట్టనున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదం
గుంటూరు : రాష్ట్రంలో అసైన్మెంట్ ల్యాండ్స్, నిరుపేదలకు ఇచ్చిన భూముల
విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హర్షణీయమైన నిర్ణయం తీసుకుంది. మొత్తం
అసైన్మెంట్ ల్యాండ్స్, లంక భూములకు సంబంధించి పూర్తి హక్కులు లబ్ధిదారులకే
కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన
కీలక భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడున్నర గంటలపాటు
సాగిన కేబినెట్ భేటీలో 55 అంశాలపై చర్చించారు. అసైన్డ్ ల్యాండ్ పొందిన
లబ్ధిదారులు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా కేబినెట్
గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ-విక్రయాలపై
పూర్తి హక్కులు దక్కుతాయని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.
కేబినెట్ నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు.
జులై నెలలో చేపట్టనున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదం
సుమారు 4.58 లక్షల మందికి 510 కోట్లు రుణాలు ఇప్పిస్తూ వడ్డీ మాఫీ రూ.10.3
కోట్లు చెల్లిస్తూ ఈ నెల 18న జగనన్న తోడు కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి
చెల్లుబోయిన తెలిపారు. ఈ నెల 20న సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పనులు
ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సీఆర్డీఏ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు
లబ్ధి చేకూర్చేలా 50 వేల మందికి ఇళ్లు నిర్మించే పనులు ప్రారంభమవుతాయని,
సుమారు రూ.5 వేల కోట్లతో ఈ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వరుసగా ఐదో
ఏడాది ఈ నెల 21న ‘నేతన్న నేస్తం’ పథకం అమలు చేస్తున్నామని, 80,686 మందికి
దాదాపు రూ.300 కోట్లు లబ్ధి చేకూరుస్తామని వెల్లడించారు. ఈ నెల 26న డ్వాక్రా
మహిళల కోసం సున్నా వడ్డీ పథకం కార్యక్రమం ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే
డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలకు సున్నా వడ్డీ కింద రూ.1300 కోట్లు, ఐదు
దఫాలుగా మహిళల ఖాతాల్లో జమచేసే కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ నెల
28న జగనన్న విదేశీ విద్యా కార్యక్రమం చేపడతామి, రూ.50 కోట్లతో 400 మంది విదేశీ
విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా మేలు చేస్తామని
తెలిపారు.
అసైన్డ్, లంక భూముల రైతులకు పూర్తి హక్కులు
భూమి లేని నిరుపేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు 63,191.84 ఎకరాలు, లంక భూముల
విషయంలో 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం
తీసుకున్నట్లు మంత్రి చెల్లుబోయిన వెల్లడించారు. అయితే ఇది ఒరిజినల్ అసైనీలకు
మాత్రమే వర్తించనుందని, ఒరిజినల్ అసైనీలు కాలం చేస్తే.. వారి వారసులకు ఈ
నిబంధన వర్తిస్తుందని చెప్పారు. 1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన
వాటికలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 20 ఏళ్లు సాగు చేసుకున్న
దళితులకు సర్వహక్కులతో భూములు ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం జగన్ కీలక నిర్ణయం
తీసుకుని ఆంక్షలన్నీ ఎత్తేశారని, ఈ కేబినెట్ దళితులకు ప్రత్యేక వరాలు
ప్రకటించిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేజ్ స్కీం
కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు సంబంధించి రుణ మాఫీ చేసేందుకు, ఇనాం
భూముల ద్వారా బీసీలకు ప్రయోజనం కలిగించేలా వారికి సర్వహక్కులు కల్పిస్తూ
కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
సీఆర్డీఏలో 47 వేల ఇళ్ల నిర్మాణాని, ఎస్ఐపీబీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
కేంద్రం నుంచి వచ్చిన క్లియరెన్స్‌తో అమరావతి సీఆర్డీఏలో 47 వేల ఇళ్ల
నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
అలాగే ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది
తెలిపారు.
కొత్త కాలేజీలు, కొత్త పోస్టులు
నంద్యాల జిల్లా బేతంచెర్ల, గుంతకల్, మైదుకూరులో పాలిటెక్నిక్ కాలేజీలకు 128
టీచింగ్, 68 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినేట్ ఆమోదం తెలిపినట్లు
మంత్రి పేర్కొన్నారు. ఒకే లోకేషన్లో ఉన్న పాలిటెక్నిక్, ఐటీఐలను ఇంటిగ్రేట్
చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాకు ఒకటి చొప్పున 26 జిల్లాల్లో
స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు,175 పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటకు గ్రీన్
సిగ్నెల్ ఇచ్చారని అన్నారు. విద్యా సంస్థల్లో పూర్తిస్థాయి బోధన సిబ్బంది
నియామకం, విద్యా వ్యాప్తిలో భాగంగా సాంకేతిక విద్యావిధానంలో మార్పులకు
అనుగుణంగా కోర్సులు ఉండాలని నిర్ణయింటినట్లు పేర్కొన్నారు. జెఎన్టీయూ
కాకినాడకు 27 నాన్ టీచింగ్ స్టాప్ నియామకానికి అంగీకరించినట్లు మరియు
యూనివర్సిటీలో బోధన సిబ్బంది కొరతను తీర్చేందుకు కేబినెట్ ప్రత్యామ్నయ
ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కర్నూలులో కేన్సర్ ఇనిస్టిట్యూట్‌కు 247
పోస్టులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా టోఫెల్ పరీక్షల కొరకు
ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ కోసం ప్రముఖ విద్యాసంస్థ ఈటీఎస్‌తో చేసుకున్న
ఒప్పందానికి కేబినెట్ ఆమోదించిందని తెలిపారు.
రిటైర్ట్మెంట్ వయసు పెంపు
అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా పని చేసేందుకు చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
తెలిపిందని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే దేవాదాయశాఖ
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి పెంపు 62 ఏళ్లకు, వర్శిటీ ప్రొఫిసర్ల
రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచతూ నిర్ణయం తీసుకున్నట్లు
మంత్రి చెప్పారు.