షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం పై చర్చ
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశం
గుంటూరు : తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కు చేరాయి. ఇటీవల కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మం ‘జనగర్జన’ సభావేదికగా మాజీ ఎంపీ
పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నాటి నుంచి
పొంగులేటి స్పీడ్ పెంచారు. రెండ్రోజుల గ్యాప్‌లోనే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి
రాజగోపాల్ రెడ్డితో భేటీ కావడం, ఆయన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం ఇవన్నీ
చకచకా జరిగిపోయాయి. అంతేకాదు బీఆర్ఎస్లోని కొందరు ముఖ్యనేతలు, కీలక నేతలకు
కూడా కాంగ్రెస్ కండువా కప్పించే పనిలో నిమగ్నమయ్యారట. అసలే తెలంగాణ రాజకీయాలు
హాట్ హాట్‌గా సాగుతున్న వేళ ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డితో పొంగులేటి భేటీ
కావడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.
తాడేపల్లికి వెళ్లి మరీ కలవాల్సిన అవసరం పొంగులేటికి ఏముంది.? అసలు
అరగంటకుపైగా ఈ ఇద్దరి మధ్య ఏమేం చర్చ జరిగింది.? ఈ భేటీ వెనకున్న
ఆంతర్యమేంటి.? అని అటు వైసీపీ, ఇటు కాంగ్రెస్ నేతలు ఏవేవో మాట్లాడుకుంటూ
గుసగుసలాడుకుంటున్నారు.
ఇదే చర్చించారా : ఖమ్మం నుంచి ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చిన పొంగులేటి
శ్రీనివాస రెడ్డి సీఎం జగన్‌తో అరగంటకుపైగా కొన్ని ముఖ్యమైన విషయాలు
మాట్లాడారని తెలియవచ్చింది. సీఎం జగన్‌తో షర్మిల పార్టీ విలీనం, కాంగ్రెస్‌లో
చేరికపై కీలకంగా చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం
చేస్తున్నారని, ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు కట్టబెడుతారని, జగనన్న వదిలిన
బాణాన్నే ఆయనపైకే వదలబోతున్నారని, ఇవన్నీ ఒక ఎత్తయితే పులివెందుల నుంచే
జగన్‌పై పోటీకి దింపుతారని ఇలా చిత్రవిచిత్రాలుగా మీడియాలో పెద్ద ఎత్తున
కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రియాంక గాంధీ రంగంలోకి అన్ని విషయాలు
చర్చించాక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ అయ్యారని
వార్తలొచ్చాయి. అంతేకాకుండా విలీనానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని జులై 8న
ఇడుపులపాయ వేదికగా విలీన ప్రక్రియ జరుగుతుందని కూడా టాక్ నడుస్తోంది. సరిగ్గా
ఇదే క్రమంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి జగన్‌ను కలవడంతో ఈ వార్తలకు మరింత
బలం చేకూరినట్లయ్యింది.
ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతోనే ఇలా : ఈ భేటీకి ముందు చాలానే జరిగిందని
విశ్వసనీయవర్గాల సమాచారం. షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధంగా ఉన్నా వైఎస్
జగన్ మాత్రం అడ్డుపడుతున్నారట. ఇలా చేస్తే వైఎస్ ఫ్యామిలీ పరువు ఏమవ్వాలి..?
అని షర్మిలతో వాదించినట్లు సమాచారం. అందుకే జగన్‌ను ఒప్పించడానికి తెలంగాణ,
ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు పొంగులేటిని దూతగా వాడుతున్నారని తెలుస్తోంది.
ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ రావడంతోనే పొంగులేటి ఎలాంటి అపాయిట్మెంట్ కూడా
లేకుండానే తాడేపల్లి ప్యాలెస్‌కు పయనమై.. జగన్‌తో భేటీ అయ్యారట. మరోవైపు ఏపీలో
పొంగులేటి చేసిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించి బిల్లుల విషయం తేల్చుకోవడానికే
జగన్‌తో భేటీ అయ్యారనే టాక్ కూడా నడుస్తోంది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే
కొన్నిరోజులు ఆగాల్సిందే మరి. కాగా 2014లో ఖమ్మం వైసీపీ ఎంపీగా గెలిచి ఆ
తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో బీఆర్ఎస్లో చేరిక, ఇప్పుడు కాంగ్రెస్‌లో
చేరినప్పటికీ వైఎస్ జగన్‌తో మాత్రం పొంగులేటి సత్సబంధాలు కొనసాగిస్తూనే
వస్తున్నారు. ఇలా జగన్‌తో పొంగులేటి ప్రత్యేకంగా భేటీ కావడం ఇదేం కొత్తకాదు.
అయితే ఇంత హాట్ హాట్‌గా రాజకీయాలు సాగుతున్న తరుణంలో వైఎస్ జగన్‌తో పొంగులేటి
భేటీ జరగడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవ్వడమే కాకుండా షర్మిల పార్టీ
విలీనం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.