విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ‘అరాజకాలు’ జరుగుతున్నాయంటూ పదే పదే రాష్ట్ర
పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ (డీజీపీ)కి లేఖలు రాయడం తెలుగుదేశం అధినేత
ఎన్.చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారిపోయిందని రాజ్యసభ సభ్యులు
విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఏడాదిన్నర లోపే
జరగనున్న నేపథ్యంలో టీడీపీ రాజకీయ వేడిని పెంచుతోంది. రాజకీయ విద్వేషాలను
రాజేస్తోంది. ఈ క్రమంలో పాలక, ప్రతిపక్షాల కార్యకర్తలు, నాయకుల మధ్య
జరుగుతున్న గొడవలను చంద్రబాబు గోరంతలు కొండంతలు చేస్తున్నారని విమర్శించారు. ఈ
కీచులాటలను సాకుగా చూపించి ఏపీలో ప్రతిపక్షాలపై విపరీతంగా దాడులు
జరుగుతున్నట్టు ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ విష ప్రచారానికి మీడియాలో చోటు
కల్పించడం కోసం ఆయన క్రమం తప్పకుండా చిన్న చిన్న రాజకీయ గొడవలపై సైతం రాష్ట్ర
డీజీపీకి లేఖలు రాస్తున్నారని విమర్శించారు.
శాంతి, భద్రతలు లోపించాయని ‘నిరూపించడానికి’, ప్రచారం చేయడానికి కొన్ని
జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను మాజీ ముఖ్యమంత్రి ఎంపిక చేసుకున్నారు. ఉమ్మడి
చిత్తూరు జిల్లా కుప్పం, పుంగనూరు, మాచర్ల జిల్లా, అనంతపురం జిల్లాలోని కొన్ని
ప్రాంతాలను ఎంపిక చేసుకుని అక్కడి సాధారణ ఘటనలపై సైతం ఆయన రాష్ట్ర డీజీపీకి
రాసే లేఖల్లో అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలో, తాను
ముఖ్యమంత్రి పీఠంపై లేని కారణంగా ఏపీలో అంతా అరాజకమే తాండవిస్తున్నట్టు బాహ్య
ప్రపంచానికి చెప్పడమే చంద్రబాబు ఉద్దేశం. అందుకే, పోలీసు ఉన్నతాధికారికి ఈ
లేఖాయణం. డీజీపీకి, కేంద్ర ప్రభుత్వానికి నిరాధార ఆరోపణలతో ఫిర్యాదులు చేసినంత
మాత్రాన ఆంధ్రా ప్రజలు నమ్మరు. అబద్ధాలతో అధికారం సంపాదించడం అసాధ్యం.
జనాదరణలో అన్ని పాలకపక్షాల కంటే ముందున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై
ఆధారాలు లేని అభియోగాలు మోపితే ఓటర్లు మోసపోవడానికి సిద్ధంగా లేరు. దాదాపు
నాలుగున్నర దశాబ్దాల అనుభం ఉన్న చంద్రబాబుకు ఈ విషయాలు చెప్పడాని టీడీపీలో
ఎవరూ లేరు మరి. వరుసగా రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితుల్లో
దిగబడిపోయిన టీడీపీకి మళ్లీ అధికారం సంపాదించడం డీజీపీకి లేఖలు రాయడం ద్వారా
కుదిరే పని కాదని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.