విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు
తీసుకువచ్చేందుకు ఈ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య,
కుటుంబ సంక్షేమ ,వైద్య విద్య శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి విడదల రజని అన్నారు
. శుక్రవారం ఉదయం ఎ ఎం సి బాలుర హాస్టల్ సమీపంలో రూ. 73.92 కోట్లతో ఆంధ్ర
మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థుల హాస్టల్ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేసారు. ఈ
సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జి +5, జి +7 విధానంలో మొత్తం 298 గదులతో
నిర్మాణం జరుగనున్నట్లు తెలిపారు . నిర్మాణం మరియు మౌలిక సదుపాయల కల్పనకు
మొత్తం 153 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు . గతంలో వున్న 1045
సీట్లతో పాటు అదనంగా 631 సీట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు .
వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు ఖర్చు
చేస్తున్నట్లు వివరించారు . జిల్లా కలెక్టర్ , స్థానిక ఎమ్మెల్యే చొరవతో
కెజిహెచ్ లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు . నాడు నేడు ద్వారా
కెజిహెచ్ ను రూ . 600 కోట్లతో నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. వైద్యులు అంకిత
భావంతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని అన్నారు.
జిల్లా కలెక్టర్ డా. ఎ . మల్లికార్జున మాట్లాడుతూ ఈ భవనాల నిర్మాణం వలన అదనపు
విద్యార్దులకు వసతి మరియు మెరుగైన సదుపాయాలు కలుగుతాయని పేర్కొన్నారు . ఎ ఎం
సి హాస్టల్ భవనాలు త్వరిత గతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి
తేవాలని అన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ గత
ప్రభుత్వాలు కెజిహెచ్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని కానీ ఈ ప్రభుత్వం మౌలిక
సదుపాయాలతో బాటు వేల సంఖ్యలో వైద్య సిబ్బందిని కూడా నియమించారని పేర్కొన్నారు
. పీజీ విద్యార్థుల సీట్లు పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
మేయర్ గొలగాని హరి వెంకట కుమారి , క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ జాన్ వెస్లీ,
ఎ ఎం సి ప్రిన్సిపల్ బుచ్చిరాజు , కెజిహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ ,
ఏపీఎంఐపీ ఎస్ ఈ , ఈ ఈ, మెడికల్ ఎడ్యుకేషన్ ఎ డి రాఘవేంద్రరావు , స్థానిక
వార్డ్ కార్పొరేటర్ నారాయణరావు, పలువురు వార్డు కార్పొరేటర్లు , వైద్యులు,
వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.