విజయవాడ : ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలను ఆకట్టుకునేలా ప్రభుత్వ పథకాల
శకటాలను తీర్చిదిద్ది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రదర్శించేందుకు సిద్ధం
చేయాలని సమాచార శాఖ కమీషనర్ టి. విజయ కుమార్ రెడ్డి సంబంధిత
అధికారులను ఆదేశించారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 76వ స్వాతంత్ర్య
దినోత్సవ వేడుకలలో ప్రదర్శించనున్న శకటాలను ఆదివారం సాయంత్రం సమాచార శాఖ
కమీషనర్ టి. విజయకుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
విజయవాడలో నిర్వహించే 76వ రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ
వేడుకలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ
పథకాలపై 13 అలంకృత శకటాలను ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో గ్రామ
వార్డు సచివాలయాలు,వ్యవసాయం,
పశు సంవర్థక, విద్య, డా.వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, గ్రామీణ
పేదరిక నిర్మూలన (సెర్ఫ్), కుటుంబ సంక్షేమం,హౌసింగ్, మతాశిశు సంక్షేమం, అటవీ,
పరిశ్రమలు, సాంఘిక, గిరిజన సంక్షేమం, రెవెన్యూ శాఖలకు చెందిన శకటాలను
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించేందుకు సిద్ధం చేస్తున్నట్లు ఆయన
తెలిపారు. శకటాలలో ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేసే అభివృద్ధి సంక్షేమ
కార్యక్రమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారాన్ని పొందుపరచడం
జరిగిందన్నారు. శకటాలను అత్యంత ఆకర్షణీయంగా అలంకరించి ప్రదర్శనలకు సిద్ధం
చేయాలని ఆయా శాఖల
అధికారులకు సూచించామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో శకటాలను
ప్రదర్శించిన అనంతరం ప్రజల సందర్శనార్థం నగరవీధుల్లో ప్రదర్శించనున్నామన్నారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి శకటాలు బందర్ రోడ్డు మీదగా
బెంజి సర్కిల్ రామవరప్పాడు రింగ్ ఏలూరు రోడ్డు మీదగా పాత బస్టాండ్, కంట్రోల్
రూమ్నండి తిరిగి మున్సిపల్
స్టేడియంకు చేరుకుంటాయని ఆయన తెలిపారు. శకటాల పరిశీలనలో కమీషనర్ వెంట సమాచార
శాఖ జాయింట్ డైరెక్టర్లు పి. కిరణ్ కుమార్, టి. కస్తూరి, సహాయ సంచాలకులు
జి.వి.ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన శకటాల ఇన్చార్జ్ అధికారులు పాల్గొన్నారు.