ఆక్వా రైతుల సమస్యలపై సాధికారిత కమిటీ భేటీ * అందుకు అవసరమైన ఎస్ఓపిలను సిద్దం చేయాలని ఆదేశం ఆక్వా రైతులకు కనీస ధర లభించేలా జాగ్రత్తలు తీసుకోవాలి * సిండికేట్ అయ్యి రేటు తగ్గించే పరిస్థితి ఎక్కడా రాకూడదు * ఎంపెడా వంటి సంస్థలతో సమన్వయం చేసుకోవాలి * ఆక్వా ఉత్పత్తుల రేట్లను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి * ఆక్వా రైతుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి * ఈక్విడార్ వంటి దేశాల్లో ఆక్వా ఉత్పత్తి, మార్కెటింగ్ విధానాలను పరిశీలించాలి సాధికారిత కమిటీ భేటీలో మంత్రులు
విజయవాడ : ఆక్వా ఉత్పత్తులకు కనీస ధర లభించేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని మంత్రుల సాధికారిత కమిటి ఆదేశించింది. విజయవాడలో రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, గనులు, శాస్త్ర-సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆక్వా ఉత్పత్తులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాధికారిత కమిటీ రెండో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వి.రఘురాం పాల్గొన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీలు నీరబ్ కుమార్ ప్రసాద్, పూనం మాలకొండయ్య, ఫిషరీస్ కమిషనర్ కన్నబాబు, ట్రాన్స్ కో జెఎండి పృథ్వితేజ్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల ధరలకు సంబంధించి తొలి సమావేశంలో సాధికారిత కమిటీ నిర్ధేశించిన మేరకు చేపట్టిన చర్యలను అధికారులు వివరించారు. ఈనెల 12వ తేదీన జరిగిన తొలి సమావేశం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు, ఫీడ్ ఉత్పత్తిదారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించామని అధికారులు వివరించారు. పెంచిన ఫీడ్ రేట్లను తగ్గించేందుకు జరిపిన చర్చలు ఫలించాయని,
పెంచిన ఫీడ్ ధరలను తయారీ సంస్థలు ఉపసంహరించుకున్నాయని తెలిపారు. అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్వాహకులతోనూ జరిపిన చర్చల నేపథ్యంలో ఆక్వా రేట్ల స్థిరీకరణకు చర్యలు తీసుకున్నామని అన్నారు. వంద కౌంట్ ఉన్న రొయ్యలకు కనీసం రూ.240 రూపాయలకు తగ్గకుండా రేటును కొనసాగించాలని సూచించామని తెలిపారు. ఈ ప్రయత్నాల వల్ల రూ.180 రూపాయలు ఉన్న ధర ప్రస్తుతం రూ.220 కి పైగా పలుకుతోందని తెలిపారు. దీనిని మరింతగా పెంచేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆక్వా రంగం ద్వారా అపారమైన అవకాశాలు ఉన్నందున ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఆక్వాజోన్ తో పాటు నాన్ ఆక్వాజోన్ లో కూడా అర్హత ఉన్న రైతులకు ప్రోత్సాహకాలను కల్పించే అంశాన్ని పరిశీలించాలని అధికారులు సాధికారిత కమిటీకి విజ్క్షప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో 1.75 లక్షల మంది రైతులు ఆక్వారంగంపై ఆధారపడి ఉన్నారని అన్నారు. వీరి ఉత్పత్తులకు న్యాయమైన రేటు దక్కేలా చూడాలని సీఎం వైయస్ జగన్ ఈ సాధికారిత కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఆక్వా ఫీడ్ రేట్లు విపరీతంగా పెంచడం,
ఆక్వా ఉత్పత్తులకు ధరలను తగ్గించడం వంటి చర్యల వల్ల ఆక్వా రైతులు కుదేలవుతున్నారని, ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే ఆక్వా ఫీడ్ రేట్లను నియంత్రించడం, ధరలను స్థిరీకరించడం చేశామని, ఇదే క్రమంలో ఆక్వా ఉత్పత్తుల ధరలను శాస్త్రీయంగా నిర్ణయించే విధానంను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అందుకోసం ఎంపెడా వంటి సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో ఆక్వా రేట్లను కూడా గమనిస్తూ, దేశీయ మార్కెట్ లో రేట్లను అందుకు అనుగుణంగా హేతుబద్దంగా ఖరారు చేసే విధానాలకు రూపకల్పన చేయాలని కోరారు. ఆక్వా జోన్ పరిధిలోని అర్హులైన రైతులకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. ఆక్వా రేట్లకు సంబంధించిన వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని, రేటుపై ప్రతి రైతుకు అవగాహన కలిగించాలని కోరారు. రాష్ట్రంలో ఆక్వా రంగంకు మంచి అవకాశాలు ఉన్నాయని, అప్సడా వంటి చట్టాలను తీసుకువచ్చి ఆక్వారంగంలో రైతుకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఆక్వా రంగంలో ముందంజలో ఉన్న ఈక్విడార్ వంటి దేశాల్లో ఉత్పత్తి, మార్కెటింగ్ లో అనుసరిస్తున్న విధానాలను అధికారులు అధ్యయనం చేయాలని సూచించారు.