ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధే ధ్యేయంగా ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్స్
విజయవాడలో ఘనంగా సీఫుడ్ ఫెస్టివల్..రూ. 699కే అన్ లిమిటెడ్ బఫెట్
త్వరలో రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో సీ ఫుడ్ ఫెస్టివల్స్ కు సన్నాహాలు
ఫిష్ ఆంధ్రా డొమెస్టిక్ మార్కెటింగ్ ప్రజా పోర్టల్” ఆవిష్కరణ
మత్స్య, పశు సంవర్థక, డెయిరీ శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు
విజయవాడ : మత్స్యకారుల సంక్షేమం కోసం స్థానిక మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని
పెంచడం, ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాల కల్పనే లక్ష్యంగా జగనన్న
ప్రభుత్వం ముందడుగులు వేస్తోందని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక, డెయిరీ శాఖ
మంత్రి డా. సీదిరి అప్పలరాజు అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో భూమి
ఆర్గానిక్స్ నాలెడ్జ్ పార్ట్నర్ గా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో మూడు
రోజులపాటు నిర్వహించే రెండో సీ ఫుడ్ ఫెస్టివల్ ను ఆయన శుక్రవారం
ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ ఏటా 50
లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో
ఉందని వెల్లడించారు. ప్రధానంగా చేపలు, రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న
మనం వినియోగంలో మాత్రం వెనుకబడి ఉన్నామన్న ఉద్దేశంతో డొమెస్టిక్ మార్కెటింగ్
అనే అంశాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని భూమి ఆర్గానిక్స్
నాలెడ్జ్ పార్టనర్ గా సీ ఫుడ్ ఫెస్టివల్స్ రాష్ట్రవ్యాప్తంగా
నిర్వహిస్తోందన్నారు. జూలై 28, 29, 30 తేదీల్లో నిర్వహిసోన్న సీ ఫుడ్
ఫెస్టివల్ లో రూ.699 కే అన్లిమిటెడ్ సీ ఫుడ్ బఫెట్ లభిస్తుందన్నారు. త్వరలో
విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు వంటి నగరాల్లోనూ సీఫుడ్ ఫెస్టివల్
నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఫిష్ ఆంధ్రా..ఫిట్ ఆంధ్రా అనే నినాదాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లేలా మత్స్యశాఖ
లక్ష్యంగా పెట్టుకుని ముందడుగులు వేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రం
తీసుకున్న ఆర్కిటెక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నమూనాను కేంద్ర ప్రభుత్వం కూడా
ప్రస్తుతం అనుసరిస్తోందన్నారు. రాష్ట్రంలో సీ ఫుడ్ వినియోగదారులు పెద్ద
ఎత్తున ఉన్నారని..ఈ మేరకు ‘ఫిష్ ఆంధ్రా’ బ్రాండ్‌తో స్థానిక వినియోగం పెంచేలా
ఆక్వా హబ్స్ అండ్ స్పోక్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి
జిల్లా కేంద్రంలో ఒక ఆక్వా హబ్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ
ఆక్వా హబ్ కు అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చి దీని ద్వారా జిల్లావ్యాప్తంగా ఉన్న
వివిధ రకాల అవుట్ లెట్స్ కు సప్లయ్ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 1,400
అవుట్ లెట్స్ ను ఏర్పాటు చేయగా..త్వరలో మరో 2,000 అవుట్ లెట్స్‌ను
అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా మరిన్ని హబ్స్,
అవుట్ లెట్స్ ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించడం,
వినియోగదారుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా సీ ఫుడ్ ఫెస్టివల్స్‌ను
నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కరోనా మరియు ఆక్వా రంగంలో ఎగుమతులకు సంబంధించిన
రెండు విపత్తులను జగనన్న ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు.
ప్రముఖ నగరాల్లో కూడా సీ ఫుడ్ ఫెస్టివల్స్: బహిరంగ మార్కెట్ లో చికెన్, మటన్,
గుడ్లు విస్తృత స్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువ సమయం నిల్వ ఉండని
చేపలు, రొయ్యలు, పీతలు తదితర సీ ఫుడ్ ను అందుబాటులో ఉంచడమనేది సవాలుతో
కూడుకున్న విషయమన్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ
మత్స్య సంపదను రాష్ట్రంలో ఒక వ్యక్తి ఏడాదికి కేవలం 8 కేజీలకు మించి
వినియోగించుకోవడం లేదన్నారు. చేపలు న్యూట్రిషన్ విలువలు ఎక్కువగా ఉండే ఆహారం
అని..అందుకే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వినియోగదారుల్లో మరింత అవగాహన
పెంచడమే ఈ ఫెస్టివల్ ఉద్దేశమని చెప్పారు. సీ ఫుడ్‌పై అవగాహన కల్పించేందుకు
వైద్యులు, పోషకాహార నిపుణులతో చర్చలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. మూడు
రోజుల పాటు నిర్వహించే ఈ ఫెస్టివల్‌కు 20 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా
వేస్తున్నామన్నారు. మత్స్య, ఆక్వా కల్చర్ రంగాల సుస్థిర అభివృద్ధికి అవసరమైన
అర్హత, నైపుణ్యం గల మానవ వనరులను తయారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్
విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు.
మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
సూచనల మేరకు రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంచేందుకు డొమెస్టిక్
మార్కెట్ ను విస్తృత పర్చాల్సిన అవసరం గుర్తించి ఆ దిశగా చర్యలు
చేపట్టామన్నారు. రాష్ట్రంలోని మత్స్యకారులకు, మత్స్య సంపదను వృద్ధి చేసే
రైతులకు మరింత మేలు చేసే విధంగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి
అమలు చేయడం జరుగుతోందన్నారు. ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెంచేలా ఫిష్ ఆంధ్రా
అనే బ్రాండ్‌ను మరింతగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏఎఫ్‌సీఓఎఫ్
ఛైర్మన్ కె. అనిల్ బాబు మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర
ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దృష్టి సారించిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.3వేల కోట్ల వ్యయంతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
జరుగుతోందన్నారు. భూమి ఆర్గానిక్స్, నాలెడ్జ్ పార్టనర్ మేనేజింగ్ డైరెక్టర్
రఘురామ్ మాట్లాడుతూ మానవునికి మంచి ఆరోగ్యాన్ని చేకూర్చే ఒమెగా-3 ఫాటియాసిడ్స్
చేపలో సమృద్ధిగా ఉంటాయన్నారు. ఇతర మాంసాహారాల కంటే చేపల వినియోగం ఎంతో
మంచిదని, అందుకే ఆరోగ్య కరమైన ఆహారాన్ని వినియోగదారులు పెద్దఎత్తున
ఉపయోగించుకునేందుకు తమ సంస్థ పెద్ద ఎత్తున కృషిచేస్తున్నట్లు తెలిపారు.
మత్స్యశాఖ, నాలెడ్జ్ పార్టనర్ భూమి ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు
స్టాళ్లను మంత్రి సందర్శించి సీ ఫుడ్ ప్రాసెసింగ్, ప్రమోటింగ్ యూనిట్స్ కు
చెందిన పలువురు ప్రతినిధులను సన్మానించారు. ఫిష్ ఆంధ్రా డొమెస్టిక్
మార్కెటింగ్ ప్రజా పోర్టల్ వెబ్ సైట్ ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో
ఏఎఫ్‌సీఓఎఫ్ ఛైర్మన్ కె. అనిల్ బాబు, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్
తోలేటి శ్రీకాంత్ పాల్గొన్నారు.news description