నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల విద్యార్థులతో ముఖాముఖిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
హైదరాబాద్ : మనిషి ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా.. తన మూలాలు, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. గ్రామమైనా, ఏజెన్సీ ప్రాంతమైనా సొంత సంస్కృతిని చూసి గర్వపడాలని అభిప్రాయపడ్డారు. శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన ఆమె నగరంలోని నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థుల సందేహాలను రాష్ట్రపతి నివృత్తి చేశారు. హైదరాబాద్ ఐటీ సహా ఇతర రంగాల్లో పురోగతి సాధించిందని, విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘‘గ్రామం, గిరిజన ప్రాంతం నుంచి వచ్చామనే ఆత్మన్యూనతను దరిచేరనీయొద్దు. సంస్కృతి పరిరక్షణ హక్కును కూడా రాజ్యాంగం మనకు కల్పించింది. మన దేశంలో ప్రతి ఊరికి గ్రామదేవత రక్షణగా ఉంటుంది. మన విశిష్ట సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు. మన రాజ్యాంగం మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించింది. అన్ని విషయాల్లో అమెరికాతో పోల్చుకోవద్దు. భారత్లో ఉన్నన్ని కులాలు, భాషలు, వైవిధ్యం అక్కడ లేవు. పిల్లలకు తల్లిదండ్రులు చిన్నతనం నుంచే విలువలు నేర్పాలి. పెరుగుతున్న యువ జనాభా భారత్కు మరింత సానుకూలం’’ అని ద్రౌపదీ ముర్ము అన్నారు. గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ దేశ మహోన్నత పదవిలో మహిళ ఉండటం గర్వకారణమన్నారు. దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ భారత్ విశ్వగురువుగా ఎదుగుతోందని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన విద్యార్థుల్లో రావాలని సూచించారు.