అమరావతి : ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఎక్సైజ్,
రెవెన్యూ శాఖల మంత్రులు కె.నారాయణ స్వామి, ధర్మాన ప్రసాదరావు, సీఎస్ డాక్టర్
కెఎస్. జవహర్‌రెడ్డి సహా అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎక్సైజ్,
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, గనులు భూగర్భశాఖ, హోంశాఖ, రవాణాశాఖ, వాణిజ్య
పన్నుల శాఖ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జీఎస్టీ వసూళ్లలో ముందంజ
కోవిడ్ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని అధికారులు సీఎంకు
తెలిపారు. లక్ష్యాలకు దగ్గరగా ఆదాయాలు ఉన్నాయని వివరించారు. డిసెంబర్ 2022
వరకూ జీఎస్టీ గ్రాస్ వసూళ్లలో దేశ సగటు 24.8 శాతంగా ఉండగా రాష్ట్రంలో వసూళ్లు
26.2 శాతం ఉందన్నారు. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, రాష్ట్రాల కన్నా మెరుగైన
వసూళ్లు రాష్ట్రంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. 2022 జనవరి నాటికి జీఎస్టీ
వసూళ్లు రూ.26,360.28కోట్లు ఉంటే, ఈ ఏడాది జనవరి నాటికి రూ.28,181.86 కోట్లు
వచ్చాయని తెలిపారు. గతేడాది ఇదే కాలపరిమితితో పోల్చుకుంటే 6.91 శాతం పెరుగుదల
కనిపించిందని అధికారులు వివరించారు.
ఎర్ర చందనం విక్రయాలకు సన్నాహాలు
గనులు – ఖనిజ శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 6 వరకూ రూ.3,649 కోట్ల
ఆర్జించినట్లు తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నూటికి నూరుశాతం
చేరుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆపరేషన్‌లో లేని గనులను
ఆపరేషన్ లోకి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు
తెలిపారు. రవాణా శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి లక్ష్యంగా
రూ.3,852.93 కోట్లు కాగా, 3,657.89 కోట్లకు చేరుకున్నట్లు అధికారులు
వెల్లడించారు. కొవిడ్ లాంటి పరిస్థితులు పూర్తిగా పోయి పరిస్థితులు నెమ్మదిగా
గాడిలో పడుతున్నాయని అధికారులు తెలిపారు.
సరళీకరణ విధానాలు
ఏపీ కన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో విధానాలను అధికారులు
అధ్యయనం చేయాలని, తద్వారా మంచి విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం
ఆదేశించారు. పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని అధికారులు
తెలిపారు. పన్ను చెల్లింపు దారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు
మెరుగుపడుతున్నాయని తెలిపారు. విధానాలను సరళీకరించుకోవడం వల్ల మంచి ఫలితాలు
వస్తున్నాయని వివరించారు. డేటా అనలిటిక్స్ వల్ల వసూళ్లు మెరుగుపడుతున్నాయని
చెప్పారు. సిబ్బందికి శిక్షణ, వారి సమర్థతను మెరుగుపరుచుకుంటున్నామని
వెల్లడించారు. టాక్స్ అసెస్మెంట్ను ఆటోమేటిక్ పద్ధతుల్లో అందించే వ్యవస్థను
నిర్మించుకున్నామని, దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా సేవలు
అందిస్తున్నామని వెల్లడించారు.