ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పౌర సన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము
విజయవాడ : రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక, తొలి ఆంధ్రప్రదేశ్ పర్యటన
సందర్భంగా స్నేహపూర్వమైన స్వాగతం లభించింది. ఇందుకు గానూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్
బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి తోపాటుగా 5 కోట్ల
మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. తిరుమల-తిరుపతి నుంచి సమస్త
దేశ ప్రజలకు ఆశీర్వాదాలు అందించే శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన ఈ పవిత్ర భూమికి
రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సమస్త దేశ ప్రజలకు ఆయురారోగ్యాలు,
సమృద్ధిని ప్రసాదించాలని తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం సందర్భంగా
ప్రార్థిస్తాను. భగవంతుడు నా ప్రార్థనను స్వీకరిస్తాడని నాకు సంపూర్ణ విశ్వాసం
ఉంది. విజయవాడ ప్రజలకు దేవి కనకదుర్గమ్మ ఆశీర్వాదాలు పుష్కలంగా ఉన్నాయి.
గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి వంటి నదులు ఆంధ్రప్రదేశ్ భూమిని
సశ్యశ్యామలం చేస్తున్నాయి. ఈ ప్రాంత సమృద్ధమైన వారసత్వాన్ని కొనసాగించేందుకు
అవసరమైన ప్రాణశక్తిని ఇస్తున్నాయి. అందుకే మన జీవనాడులైన నదులను
సంరక్షించుకోవాలని ఈ సందర్భంగా దేశ ప్రజలను కోరుతున్నాను. ప్రఖ్యాత బౌద్ధ
గురువైన నాగార్జునుడి పేరుతో నాగార్జున సాగర్ ను నిర్మించడం, అభివృద్ధిని, మన
వారసత్వంతో జోడించే అద్భుతమైన ఘట్టంగా భావిస్తున్నాను. నాగార్జున కొండ,
అమరావతి ప్రాంతాలు భారతదేశ ఆధ్యాత్మిక వైవిధ్యతకు తార్కాణంగా నిలుస్తున్నాయి.
దీంతోపాటుగా మన కళాత్మక శక్తిని కూడా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి.
విజయవాడకు సమీపంలోని కూచిపూడి గ్రామంలో భారతదేశ ప్రఖ్యాత నృత్యకళ ‘కూచిపూడి’
పేరుతోనే మన సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తోంది.
తెలుగుభాష, సంస్కృతి ప్రాశస్త్యం యావత్భారతానికి చిరపరిచితమే. ‘దేశభాషలందు
తెలుగు లెస్స’ అనే మాట భారతీయ భాషల పట్ల మనకున్న గౌరవభావానికి ప్రతీక.
కవిత్రయమైన నన్నయ, తిక్కన, ఎర్రనలు భారతీయ భాషల అద్భుతమైన అభివ్యక్తీకరణకు
ఉదాహరణలు. భారతీయ భాషల్లోని గొప్పదనాన్ని పున:స్థాపితం చేసే ఈ భావన.. నూతన
జాతీయ విద్యావిధానం – 2020లో స్పష్టంగా కనిపిస్తుంది.
మన భారతదేశ గౌరవాన్ని మరింతగా పెంచిన ఆంధ్రప్రదేశ్ గడ్డ ముద్దుబిడ్డ అయిన
కవియిత్రి మొల్ల గురించి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. ఐదున్నర శతాబ్దాల
క్రితం వెనుకబడిన వర్గాలనుంచి వచ్చిన కవయిత్రి మొల్ల రాసిన ‘మొల్ల రామాయణం’
భారత సాహిత్య చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మహిళల పట్ల గౌరవభావాన్ని
ప్రదర్శించే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
సుప్రసిద్ధ తెలుగు రచయిత గురజాడ అప్పారావు రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం నేటికీ
ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన దుర్గాబాయి దేశ్ ముఖ్ దాదాపు వందేళ్ల క్రితమే
మహిళా సాధికారతకోసం పాటుపడుతూనే దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక భూమిక
పోషించారు. ఆంధ్ర మహిళా సభను ఏర్పాటుచేసి సమాజ కల్యాణం కోసం చేసిన కృషి
చిరస్మరణీయం. దుర్గాబాయి దేశ్ ముఖ్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ కోడలైన సరోజిని
నాయుడు మహాత్ముని ఉప్పుసత్యాగ్రహంలో ప్రధానంగా వ్యవహరించారు. ఇందుకోసం వారు
జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత
మొదటి మహిళా గవర్నర్ గా కూడా వారు ఖ్యాతి గడించారు.
నేను జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో సరోజిని నాయుడుని
గుర్తుచేసుకుని వారు చూపిన ఆదర్శాలను పాటించాలని, ధైర్యంగా ప్రజాసేవలో
పాల్గొనాలని నిశ్చయించుకున్నాను. దేశ సేవే జీవితమార్గమని సంకల్పించుకున్నాను.
మహిళా సాధికారత, దేశాభివృద్ధి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల భాగస్వామ్యాన్ని
తెలియజేసేందకు భారతదేశ రెండో రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి
రాధాకృష్ణన్ గారి మాటలను గుర్తుచేసుకుంటున్నాను. ‘తెలుగువారిమైన మేం కొన్ని
విషయాల్లో అదృష్టవంతులం. మేం సంప్రదాయవాదంగా అంత బలమైన వారిమి కాకపోయినా..
ఔదార్యం విషయంలో, మా భావాలను వెల్లడించే విషయంలో స్పష్టతతో ఉంటాం. అందుకే మా
మహిళలు ఇతరులతో పోలిస్తే చాలా స్వేచ్ఛగా ఉంటారు’ అని డాక్టర్ సర్వేపల్లి
రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వీరితోపాటు మాజీ రాష్ట్రపతి, భారతరత్న వీవీ గిరి,
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గార్లను గుర్తుచేసుకుని గర్వపడతాను. ఇలాంటి
వ్యక్తులను గుర్తుచేసుకోవడం కర్తవ్యపాలనలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆంధ్ర ప్రజల
భాగస్వామ్యాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది మన్యం వీరుడు
అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలు జరుపుకుంటున్నాం. 27 ఏళ్ల వయసులో
దేశ స్వాతంత్ర్య కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు, 25 ఏళ్ల
వయసులోనే భరతమాత స్వేచ్ఛకోసం ప్రాణాలు అర్పించిన భగవాన్ బిర్సాముండా వంటి వారు
చేసిన త్యాగాల గురించి నేటితరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన్యం వీరుడి
పేరుతో ‘అల్లూరి సీతారామరాజు స్మారక గిరిజన సంగ్రహాలయా’న్ని
ఏర్పాటుచేస్తున్నారన్న విషయం తెలిసి హర్షం వ్యక్తం చేస్తున్నాను. ప్రతి ఏటా
నవంబర్ 15న ‘జనజాతీయ దినోత్సవం’ సందర్భంగా.. మ్యూజియంలు, స్మారకాలు
నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో యావద్భారత ప్రజల పట్ల
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంలో మనకు అందమైన జాతీయ జెండాను అందించిన
త్రివర్ణ పతాక రూపకర్త ‘ పింగళి వెంకయ్య’ ని మనమంతా స్మరించుకుని వారికి
నివాళులు అర్పించాలి. అమృతకాలంలో ఆధునిక ప్రగతివైపు పయనిస్తున్న నేపథ్యంలో
దేశవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పోషిస్తున్న భూమికను దేశ
ప్రజలు గుర్తుపెట్టుకుంటారు.
నేటికి వందేళ్ల ముందు, 1922లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ విషయాన్ని
విస్తృతంగా అధ్యయనం చేసి బయో కెమిస్ట్రీ రంగంలో విశేషమైన పాత్ర పోషించిన
ఎల్లా ప్రగడ సుబ్బారావు గురించి కూడా నేటి యువత తెలుసుకోవాలి. వీరి ప్రయోగాల
కారణంగానే మానవాళికి అవసరమైన ఎన్నో ఔషధాల సృష్టి జరిగింది. అలోపతితోపాటు
ఆయుర్వేదంలోనూ వారికున్న అభిరుచిని ప్రత్యేకంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం
ఉంది. ఈ సందర్భంగా నూతన జాతీయ విద్యావిధానం – 2020 ను
ప్రస్తావించదలచుకున్నాను. ఎన్ఈపీ-2020లో మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట
వేస్తూనే ఆధునిక ప్రపంచంలో మనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకునే దిశగా
ప్రత్యేకమైన కార్యాచరణ ఉంది. దీన్నే వందేళ్లకు ముందు ఎల్లాప్రగడ సుబ్బారావు
గారు చేసి చూపించారు.
ఆధునిక సాంకేతికత విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలోని ఇస్రో..
ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టి్స్తోంది. ఆధునిక సాంకేతికత మరీ
ముఖ్యంగా సమాచార విప్లవం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. యావత్ ప్రపంచంలో
భారతదేశ కీర్తి పతాకను ఎగురవేస్తున్నారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా
తెలుగువారు అవకాశం ఉన్నచోటల్లా సాంకేతిక రంగంలో తమ సత్తాచాటుతున్నారు.
గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ మార్గదర్శనంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి నేతృత్వంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపూర్ణ సహకారంతో ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పథంలో ఇలాగే ముందడుగేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు
దేశ పురోగతిలో తమ భాగస్వామ్యాన్ని ఇకపైనా ఇలాగే కొనసాగిస్తారని విశ్వాసం
వ్యక్తం చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ సోదర, సోదరీమణులు, చిన్నారుల బంగారు భవిష్యత్తును ఆకాంక్షిస్తూ
నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను అన్నారు.