బీజింగ్ : తన భర్త చికిత్సకు విరాళం అందించిన నాలుగు వేల మందికి పైగా దాతల
సొమ్మును తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యారో మహిళ. వారి సాయాన్ని కొనియాడుతూ..
తాను తిరిగి ఇచ్చిన నగదు అవసరాల్లో ఉన్న ఇతరులకు ఉపయోగపడుతుందని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కోమాలోకి వెళ్లిన భర్తను కాపాడుకునేందుకు
ఆమె చేయని ప్రయత్నమంటూ లేదు. వైద్యులు భరోసా ఇవ్వని వేళ ఆస్పత్రి బెడ్‌పై
సపర్యలు మొదలు వ్యాయామం చేయించడం వరకు దాదాపు మూడేళ్లపాటు కంటికి రెప్పలా
కాచుకుని అతన్ని కోలుకునేలా చేసింది. ఈ క్రమంలోనే కష్టకాలంలో తనకు ఆర్థికంగా
అండగా ఉన్న దాతలను ఆమె మరిచిపోలేదు. నాలుగు వేల మందికి పైగా దాతల వివరాలను
నమోదు చేసుకున్న ఆమె వారందించిన రూ.21 లక్షకుపైగా సాయాన్ని తిరిగి
ఇచ్చేస్తానని ప్రకటించారు.
చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి మూడేళ్ల క్రితం కారు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే కోమాలోకి వెళ్లిపోయాడు. కోలుకునే
అవకాశాలు తక్కువేనని వైద్యులు తెలిపారు. అయినా.. తన భర్త కోలుకుంటాడన్న
నమ్మకంతో అతని భార్య నిరంతరం సేవలందించారు. ఎట్టకేలకు మూడేళ్లకు కోమానుంచి
బయటకు వచ్చాడు. ఈ మధ్యకాలంలో చికిత్స, మందులకు పెద్దమొత్తంలోనే ఖర్చయ్యింది.
అప్పటికే దాచుకున్న డబ్బు అయిపోవడంతో.. సాయం కోసం అభ్యర్థించగా దాదాపు నాలుగు
వేలకు పైగా దాతలు ఆమెకు అండగా నిలిచారు. కోమా నుంచి బయటకు వచ్చిన తన భర్త
క్రమంగా కోలుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే నడవడం, చిన్నచిన్న పనులు చేయడం
మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలను ఆమె ఇంటర్నెట్లో పోస్టు
చేస్తుంటారు. భర్త కోలుకుంటుండటంపై ఆనందం వ్యక్తం చేసిన ఆమె డబ్బు తిరిగి
ఇచ్చేస్తే గతంలో తమకు ఉపయోగపడినట్లుగానే ఆ నగదు అవసరాల్లో ఉన్న ఇతరులకు సాయంగా
ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.