విజయవాడ : ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సేవలు అందించగలిగేలా రెడ్ క్రాస్
వ్యవస్ధను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
అన్నారు. వైద్య ఆరోగ్య సేవలకు చిరునామాగా రెడ్ క్రాస్ వ్యవహరించాలన్నారు. ఎన్
టిఆర్ జిల్లా రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో కెనడియన్ రెడ్ క్రాస్ సహకారంతో బహుళ
ప్రయోజనాలకు ఉపయోగపడేలా రూపొందించిన ప్రత్యేక వాహనాన్ని విజయవాడ రాజ్ భవన్
వేదికగా గురువారం గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తమ
దాతృత్వం సద్వినియోగం అవుతుందన్న నమ్మకం కలిగించగలిగితే సమాజంలో వ్యధాన్యులకు
కొదవ లేదని రెడ్ క్రాస్ ఆదిశలో అనుసంధాన కర్తగా వ్యవహరించి నిరుపేదలకు సహాయ
సహకారాలు అందించేలా చూడాలన్నారు. రెడ్ క్రాస్ జిల్లా విభాగం ఛైర్మన్ డాక్టర్
సమరం మాట్లాడుతూ అన్ని రకాల సౌకర్యాలతో ఈ వాహనం సమకూరిందన్నారు. ఎన్ టిఆర్
జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షుడు ఢిల్లీ రావు మాట్లాడుతూ
రక్తదానం, వ్యాక్సినేషన్, అత్యవసర వైద్యం వంటి అవసరాలకు ఈ ప్రత్యేక వాహనాన్ని
ఉపయోగిస్తామని గవర్నర్ కు వివరించారు. నిత్యం ఈ వాహనం ద్వారా కనీసం పది
యూనిట్ల రక్తాన్ని సమీకరించాలన్న లక్ష్యాన్ని కలిగి ఉన్నామన్నారు. రెడ్ క్రాస్
రాష్ట్ర శాఖ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్
మార్గనిర్దేశకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు
చేపట్టామన్నారు. సంస్ధ ప్రధాన కార్యదర్శి ఎకె ఫరీడా మాట్లాడుతూ రెడ్ క్రాస్
రాష్ట్ర శాఖ పనితీరుకు మెచ్చి, అంతర్జాతీయ సంస్ధలు పలు రూపాలలో
సహకరిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్
సింఘాల్, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్, ఉప కార్యదర్శి నారాయణ
స్వామి తదితరులు పాల్గొన్నారు.