చేనేత, జౌళి శాఖ కమీషనర్, ఆప్కో ఎండీ ఎంఎం నాయక్
అందుబాటులో తక్కువ బరువు, మెత్తదనంతో కూడిన బొబ్బిలి ప్రింటెండ్ కాటన్ చీరలు
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ప్యాషన్ టెక్నాలజీ సౌజన్యంతో ఆప్కో వస్త్రాల రూపకల్పన
విజయవాడ : ఆప్కో చేనేత వస్త్ర శ్రేణిలో ఆధునిక వెరైటీలకు శ్రీకారం చుట్టే క్రమంలో ప్రత్యేక వస్త్రాలను అందుబాటులో ఉంచామని చేనేత, జౌళి శాఖ కమీషనర్, ఆప్కో ఎండి ఎంఎం నాయక్ తెలిపారు. మంగళవారం ఆప్కో కేంద్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్యాషన్ టెక్నాలజీ సంస్దల సౌజన్యంతో యువతను ఆకర్షించే విధంగా వీటికి రూపకల్పన చేస్తున్నామన్నారు. ఆ పరంపరలో భాగంగా మన్యం జిల్లా నారాయణపురం సొసైటీ నుండి 100ఎస్*100ఎస్ కౌంట్ యార్న్ తో తయారు చేసిన బొబ్బిలి ప్రింటెండ్ కాటన్ చీరలు ఆప్కో షోరూమ్ లలో అందుబాటులో ఉంచామన్నారు. తక్కువ బరువు, మెత్తదనంతో చేతి మగ్గంపై తయారయిన ఈ చీరలు ఆధునికతకు అనవాలుగా ఉంటాయన్నారు. భారతీయ వారసత్వ కళా సంపదగా ఉన్న చేనేతను ప్రతి ఒక్కరూ ఆదరించి ఆ కళను పరిరక్షించుకోవలసిన అవసరం ఉందని నాయక్ వివరించారు. చేనేత వస్త్ర వినియోగాన్ని పెంపొందించి, అందరికీ అనుకూలంగా అందుబాటు ధరలలో చేనేత వస్త్రాలను సిద్ద చేయాలన్న ధ్యేయం మేరకు చేనేత జౌళి శాఖ పనిచేస్తుందన్నారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని అందిస్తున్న 30 శాతం రాయితీని గణతంత్ర దినోత్సవ వేడుకల నేపధ్యంలో జనవరి నెలాఖరు వరకు పొడిగించామని, కొన్ని ప్రత్యేక వెరైటీలపై 50 శాతం రాయితీ కూడా అమలు చేస్తున్నామని చేనేత, జౌళి శాఖ కమీషనర్, ఆప్కో ఎండి ఎంఎం నాయక్ పేర్కొన్నారు.