ఆఫ్రికా దేశాల నేతలు కీవ్‌కు వచ్చిన సమయంలో భారీగా దాడులు జరిగాయి. ఈ నేతల్లో
కొందరు నగరంలో ఉన్న సమయంలో గగనతల రక్షణ వ్యవస్థ సైరన్లు నిరంతరాయంగా మోగాయి.
అదే సమయంలో నల్ల సముద్రంపై నుంచి రష్యా పలు కల్బిర్ క్షిపణులను
ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వాయుసేన పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను
ఉక్రెయిన్ దౌత్యవేత్త ఒలెక్సాండర్ స్కెర్బా ట్వీట్ చేశారు. ‘‘సైరన్లు
మోగుతున్నాయి. పుతిన్ ఆఫ్రికా నాయకులకు కీవ్‌లో స్వాగతం పలుకుతున్నారు’’ అని
పేర్కొన్నారు. శుక్రవారం ఏడుగురు ఆఫ్రికా నేతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు
జెలెన్స్కీతో భేటీ అయ్యేందుకు కీవ్‌కు చేరుకున్నారు. దక్షిణాఫ్రికా
అధ్యక్షుడు సిరిల్ రామఫోసా శుక్రవారం ఉదయం నగరానికి చేరుకొన్నారు. జాంబియా,
ది కొమోరోస్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్, సెనెగల్, ఉగాండా నేతలు ఈ
శాంతి ప్రక్రియలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ భేటీ అనంతరం వారు రష్యాకు
వెళ్లనున్నారు. అక్కడ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ
కానున్నారు.
ఆక్రమిత ప్రాంతాల్లో ఎన్నికలు : ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లో మరో మూడు
నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు మాస్కో వెల్లడించింది. ఇప్పటికే కీవ్
ఎదురు దాడులతో చాలా చోట్ల రష్యా సైనికులు వెనుకంజ వేస్తున్న పరిస్థితుల్లో ఈ
ప్రకటన రావడం గమనార్హం. పరిస్థితి తమ ఆధీనంలో ఉందన్న సంకేతాలు ఇచ్చేందుకే
రష్యా ఈ ప్రకటన చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వెనక్కి
తగ్గేందుకు సిద్ధంగాలేమని ఉక్రెయిన్ కూడా చెబుతోంది. నిర్ణయాత్మక పోరాటాలు
ముందున్నాయని కీవ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు ఏడాది తర్వాత ఉక్రెయిన్
సేనలు మరోసారి ఎదురుదాడులను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. ఉక్రెయిన్ దళాలు
ఆక్రమించిన ప్రాంతాల్లో ధ్వంసమైన రష్యా వాహనాలు రోడ్ల పక్కన కనిపిస్తున్నాయి.
‘‘మా వీరోచిత సేనలు రష్యాను ఓడించడానికి సరిహద్దుల్లో తీవ్రంగా
పోరాడుతున్నాయి. రష్యా ఓడిపోతోంది’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ
ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.