హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై
ఉత్కంఠ కొనసాగుతోంది. బిల్లుపై రాజ్‌భవన్ మొదట వివరణ కోరగా ప్రభుత్వం సమాధానం
ఇచ్చింది. అయితే గవర్నర్ మళ్లీ కొత్త సందేహాలు వ్యక్తం చేశారు. వాటికీ
ప్రభుత్వం సమాధానాలు పంపింది. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో ఈ బిల్లు
ప్రవేశానికి నోచుకుంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన బిల్లు
అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై అనేక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్టీసీ విభజన,
కార్మికుల జీతభత్యాలు, పింఛన్లు, ఉద్యోగ భద్రత వంటి 5 ప్రధాన అంశాలపై రాజ్‌భవన్
సందేహాలు లేవనెత్తగా.. సీఎస్ శాంతికుమారి వివరంగా లేఖ రాశారు. దానిపై సంతృప్తి
చెందని గవర్నర్.. మరో 6 అంశాలపై అదనపు సమాచారం కోరారు. వాటి వివరాలతో కూడిన
లేఖను విడుదల చేసిన రాజ్‌భవన్.. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాలవాంఛను రాజ్‌భవన్
అడ్డుకోవడం లేదని, వారికి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు
తలెత్తకుండా ప్రక్రియను పూర్తి చేయడానికే గవర్నర్ తదుపరి వివరణను కోరారని
పేర్కొంది. గవర్నర్ తాజా లేఖకూ శనివారం సాయంత్రమే సీఎస్ సమాధానమిచ్చారు.
తొలుత 5 ప్రధాన అంశాలపై వివరణ
తర్వాత మళ్లీ 6 అంశాలపై అదనపు సమాచారం కావాలని గవర్నర్ కోరారు. ప్రభుత్వం
ఇచ్చిన వివరణలో కేంద్రం వాటా 30 శాతం ఉందని పేర్కొన్నందున విలీనానికి కేంద్రం
అనుమతి తీసుకున్నారా? తీసుకుని ఉంటే సంబంధిత కాపీని పంపగలరని కోరారు.
తీసుకోకుంటే న్యాయపరమైన చిక్కులను పరిష్కరించడానికి తీసుకొన్న చర్యలను
వివరించాలని తెలిపారు.
ఆర్టీసీలో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలు ఇవ్వాలన్న రాజ్‌భవన్
శాశ్వత ఉద్యోగులు మినహా మిగిలిన వారి విషయంలో చట్టపరంగా తీసుకోనున్న చర్యలు
ఏంటని ప్రశ్నించారు. కార్పొరేషన్‌కు సంబంధించిన చర, స్థిరాస్తులు అలాగే
కొనసాగుతాయా? లేదా చెప్పాలని వివరణ కోరారు. కొనసాగకుంటే తెలంగాణ ప్రభుత్వం
వాటిని స్వాధీనం చేసుకుంటుందా చెప్పాలన్నారు. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం
చేస్తే వారి బాధ్యతలను నియంత్రించే అధికారం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు.
ఉద్యోగులను ప్రభుత్వంలో కలుపుకున్న తర్వాత వీరంతా కార్పొరేషన్లో డిప్యుటేషన్‌పై
పని చేస్తారా? లేక వేరే ఏర్పాటు ఏదైనా ఉందా అంటూ వివరణ కోరారు.