సినిమాల్లోనే కాదు, రాజకీయ రంగంలోనూ అగ్రగామిగా వెలుగొందారు
ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్ : టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు
శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు.
ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్,
నందమూరి రామకృష్ణ, సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు నివాళులర్పించారు.
హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి
సందర్భంగా హిందూపురం శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పోలీ బ్యూరో సభ్యులు
నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో
మాట్లాడారు. ‘ఎన్టీఆర్ శత జయంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా
ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ఆయన సినిమాల్లోనే కాదు, రాజకీయ
రంగంలోనూ అగ్రగామిగా వెలుగొందారు. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు ఎన్టీఆర్
తెదేపా ను స్థాపించారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలను
ప్రవేశపెట్టారు. ఆయన తీసుకొచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం నేడు ఆహార
భద్రతగా మారింది. మహిళలకు ఆస్తి హక్కు తదితర చరిత్రాత్మక నిర్ణయాలను ఆయన
తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆయన
కుమారుడిగా జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నా అని బాలకృష్ణ అన్నారు.