అమరావతి: శాసనసభ సమావేశాల సందర్భంగా ఆరు బడ్జెట్ పద్దులకు ఏకగ్రీవంగా ఆమోదం
లభించింది. సభలో వ్యవసాయ–సహకార, పశు సంవర్థక–మత్స్య, పౌర సరఫరాలు,
ప్రణాళిక–శాసన వ్యవహారాలు, గవర్నర్, కేబినెట్, జీఏడీ నిర్వహణ, సమాచార, ప్రజా
సంబంధాలకు చెందిన పద్దులను ప్రవేశపెట్టారు. వీటిపై చర్చించిన అనంతరం మంత్రులు
సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకునే ప్రతి
నిర్ణయం రైతులకు అండగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా ఖరీఫ్‌కు ముందస్తుగా సాగునీరు, వైఎస్సార్ రైతు
భరోసాతో పెట్టుబడి సాయం అందించడం మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. దేశంలో ఎక్కడా
లేని విధంగా రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమాను
అందిస్తున్నామన్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లభించని పంటలను ఎమ్మెస్పీకి
కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. టీడీపీ హయాంలో ఆక్వా జోన్ పరిధిలో 2.56
లక్షల ఎకరాలు, నాన్ ఆక్వా జోన్లో 1.90 లక్షల ఎకరాలు భూమి ఉందని పశుసంవర్థక,
మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆక్వా
జోన్లోకి 4.20 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. ఆక్వా రైతులకు సబ్సిడీ
విద్యుత్‌కు సంబంధించి టీడీపీ సర్కారు రూ.309 కోట్ల రీయింబర్స్ పెండింగ్‌లో
పెట్టగా, తమ ప్రభుత్వం వచ్చాక యూనిట్ రూ.1.50 చొప్పున సబ్సిడీ విద్యుత్
ఇస్తూనే పాత బకాయిలతో కలిపి రూ.2,687 కోట్లు ఖర్చు చేశామన్నారు. పాడి రైతులకు
గతంలో ఎన్నడూ లేని విధంగా లీటరు గేదె పాలపై రూ.20 లబ్ధి చేకూరుస్తున్నట్టు
చెప్పారు. అమూల్ రేట్లు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్
డెయిరీలు రేట్లు పెంచాల్సి వచ్చిందని, ఆ మేరకు రైతులకు రూ.2,300 కోట్ల మేర
ప్రయోజనం కలిగిందని తెలిపారు.