అంగట్లో సరుకుల మాదిరి అమెరికాలో గన్నులు అమ్ముతుంటారు. ‘రక్షణ కోసం’ అనే
సాకుతో అక్కడ గన్ కల్చర్ పెరిగిపోయింది. అది ఎంత దాకా అంటే.. పిల్లలు కూడా
గన్నులు పట్టుకునే స్థాయికి వెళ్లింది. ఇలాంటి ఆశ్చర్యకర ఘటన వర్జీనియాలో
చోటుచేసుకుంది. వర్జీనియా నార్ ఫోక్ లోని లిటిల్ క్రీక్ ఎలిమెంటరీ స్కూల్ లో
చదువుతున్న 6 ఏళ్ల స్టూడెంట్.. ఏకంగా క్లాసుకు హ్యాండ్ గన్ తీసుకుని వెళ్లాడు.
ఈ విషయాన్ని గమనించిన స్కూల్ స్టాఫ్.. చిన్నారి దగ్గరి నుంచి తుపాకీ తీసుకుని
పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు గన్ స్వాధీనం చేసుకుని స్టూడెంట్ తల్లిపై కేసు నమోదు చేశారు. లోడ్
చేసిన తుపాకీ పిల్లాడు తీసుకునేంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు లెట్టీ ఎం. లోపెజ్
అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత రిలీజ్ చేశారు. ఈ ఘటనతో క్లాసులను
నిలిపేశామని, పిల్లలకు సెలవు ఇచ్చి ఇళ్లకు పంపేశామని నార్ ఫోక్ ప్రభుత్వ
స్కూళ్ల అధికార ప్రతినిధి మిషెల్లే వాషింగ్టన్ చెప్పారు. జనవరిలో
వర్జీనియాలోని ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో ఆరేళ్ల బాలుడు కాల్పులు జరపడం
కలకలం రేపింది. ఈ ఘటనలో టీచర్ తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది అమెరికాలో దాదాపు
గన్ సంబంధిత ఘటనల్లో 44 వేల మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.