నిర్మల్ : రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య
మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అటవీ, పర్యావరణ, న్యాయ,
దేవాదాయ శాఖ మంత్రి అల్లొల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్
పట్టణంలోని ఎంసీఎచ్ లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్
రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రసూతి వార్డులో పలువురు
గర్భిణిలను పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉందని, వైద్య సేవలు ఎలా
అందుతున్నాయని వాకబు చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది మంచిగా
చూసుకుంటున్నారని మంత్రికి వారు బదులిచ్చారు. వారికి కేసీఆర్ కిట్లను
అందజేశారు. ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు,
నర్సులు. ఇతర వైద్య సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. మహిళలకు అంతర్జాతీయ
మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులు, వైద్యలు, నర్సులు, ఎఎన్ఎంలు,
ఆశ వర్కర్లు పని తీరుబాగుందని, మీ వల్లే ప్రభుత్వానికి మంచి పేరు
వస్తుందని వారి సేవలను కోనియాడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ
రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్రంలోని
వైద్యరంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని, దీంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై
నమ్మకం పెరిగిందన్నారు.
ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని
పురస్కరించుకొని ‘ఆరోగ్య మహిళ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని సీయం కేసీఆర్
అమలు చేస్తున్నారని తెలిపారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమం అమలు కానుందని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
10 అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు,
బస్తీ దవాఖానాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొనారు. ప్రతి
మంగళవారం ప్రత్యేకంగా ‘ఉమెన్ క్లినిక్’లు నిర్వహిస్తారని, మహిళలు ప్రధానంగా
ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు ఇక్కడ వైద్యం అందించనున్నారని
వెల్లడించారు. ఉమెన్ క్లినిక్స్‌కు వచ్చే మహిళలకు అక్కడికక్కడే బీపీ,
షుగర్, అనీమియా పరీక్షలు నిర్వహిస్తారు. వీటితోపాటు టీ డయాగ్నోస్టిక్స్
ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారన్నారు. ఈ సేవలను మహిళలు
ఉపయోగించుకోవాలని సూచించారు. అదే విధంగా నిర్మల్ పట్టణంలో త్వరలోనే
ఇప్పుడున్న వాటితో పాటు మొత్తం 450 పడకల ఆసుపత్రి సేవలు అందుబాటులోకి
రానున్నాయని తెలిపారు. అనంతరం బంగల్ పేట్ లోని పీహెచ్సీ లో ఆరోగ్య మహిళ
కార్యక్రమాన్ని ప్రారంభించి, మహిళ దినోత్సవ వేడుకల్లో మంత్రి
పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా
వైద్యాధికారి ధన్ రాజు, ఎంసీహెచ్ ఇంచార్జ్ డాక్టర్ రజిని, ఇతర వైద్య
సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.