పల్నాడు : ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు, అభివృద్ధి, సంక్షేమం విషయంలో
దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ నమూనాను అనుసరించే రోజులు దగ్గరలోనే
ఉన్నాయని సిఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో
చేపట్టిన ఫ్యామిలీ క్లినిక్‌లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడులో
ప్రారంభించారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లామిలీ క్లినిక్‌లు
అందుబాటులోకి వస్తున్నట్లు ప్రకటించారు.
ఇకపై గ్రామాల్లో ప్రజలు డాక్టర్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదని, డాక్టర్
స్వయంగా గ్రామానికి వస్తారని, ఇంటి చేరువకు వస్తారని, ఇళ్ల దగ్గరకే డాక్టర్
సేవలు వస్తారని చెప్పారు. మందులు కూడా ఇళ్ల చేరువకు వచ్చే కార్యక్రమమే
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.
ఇప్పటి వరకు పెన్షన్లు ఏ విధంగా ఇంటికి నడిచి వస్తున్నాయో, వైద్య సేవలు కూడా
గ్రామాలకు, సమీప ప్రాంతాలకు, అవసరమైన సందర్భాల్లో ఇంటికి కూడా కదలి రావడమే
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అని ముఖ్యమంత్రి వివరించారు. వైద్య రంగంలో
రాష్ట్రంలో గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతున్నట్లు చెప్పారు.
ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు…
పేదలు, పేద సామాజిక వర్గాలు ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా,
వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం
లేకుండా, గ్రామం వద్దకే వచ్చే గొప్ప కార్యక్రమం అని సిఎం చెప్పారు. ఆధునిక
వైద్యాన్ని ఉచితంగా గ్రామంలో అందించడానికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
తీసుకొచ్చినట్లు చెప్పారు. మంచానికి పరిమితం అయిన రోగులకు గడప వద్దకే అవసరమైన
వైద్యం చేయడం కోసం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చామన్నారు.
“ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్” అనే సూత్రం ఆధారంగా దేశ చరిత్రలో రోల్
మోడల్‌గా నిలిచిపోయే విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానానికి రూపకల్పన చేసినట్టు
చెప్పారు.
దేశానికే ఆదర్శంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం రూపకల్పన…
దేశం మొత్తం ఫ్యామిలీ విధానాన్ని అమలు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సిఎం
చెప్పారు. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిపోయే నూతన అధ్యాయంగా నిలిచి
పోతుందన్నారు. ప్రతి ఊళ్లో ఎంతమందికి బీపీ ఉంది, షుగర్ ఎక్కువగా ఉంది, రక్త
హీనత, విటమిన్ల లోపం, ఇతర జబ్బులు ఎంతమందికి ఉన్నాయనే సంగతి ఖచ్చితంగా
తెలుసుకోవచ్చన్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు, టీబీ, దీర్ఘ కాలిక జబ్బులు
ఉన్న వారు ఎంత మంది ఉన్నారో తెలుస్తుందన్నారు. స్క్రీనింగ్ దశలోనే వారందరిని
ఐడెంటిఫై చేసి వ్యాధి ముదరకముందే వారికి అవగాహన కల్పించి మందులిచ్చే
కార్యక్రమం, వైద్యం చేసే కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని
చెప్పారు.
బీపీలు, షుగర్ ఉన్న వారు, ఇతర వ్యాధులు ఉన్న వారిని తొలిదశలోనే వైద్యం చేయడం
ద్వారా తొలి దశలోనే వైద్యం చేసి వారిని కాపాడగలుగుతామన్నారు. అన్ని రకాల
జబ్బుల నుంచి రక్షణ చక్రం ఫ్యామిలీ డాక్టర్‌తో మొదలవుతుందన్నారు. ప్రతి
ప్రాణాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నట్లు చెప్పారు. ఏ
పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని ఈ విధానాన్ని మొదలు పెడుతున్నామన్నారు.
అందుబాటులో 105 రకాల మందులు….
105రకాల మందులు విలేజ్ క్లినిక్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి
గ్రామంలో 105 రకాల మందులిచ్చే క్లినిక్‌తో పాటు 14రకాల వైద్య పరీక్షలు చేసే
వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. వీటితో పాటు విలేజ్ క్లినిక్‌లో వీడియో
కాన్ఫరెన్స్ సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లను
సైతం వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా వైద్యం చేయించే గొప్ప వ్యవస్థ ప్రజల
వద్దకు నడిచి వచ్చిందని చెప్పారు.
సాధారణ వైద్య సేవలే కాకుండా తల్లులకు అవసరమైన సేవలు, బాలింతలకు అవసరమైన
వైద్యం, అంటువ్యాధులకు సంబంధించిన సేవలు, బడి పిల్లలు, అంగన్ వాడీ కేంద్రాలకు
అవసరమైన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా అంద చేస్తామన్నారు.
ప్రతి రెండు వేల జనాభాకు వైఎస్సార్ విలేజ్ క్లినిక్ స్థాపించామని, బిఎస్సీ
నర్సింగ్ చేసి వ్యక్తి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా ప్రజలకు నిరంతరం
అందుబాటులో ఉంటారు. మరో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు కూడా విలేజ్ క్లినిక్ పరిధిలోనే
పని చేయాల్సి ఉంటుందన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు
ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడే కాపురం ఉండాలని, వారంతా ఖచ్చితంగా అయా కేంద్రాల
పరిధిలోనే 24 గంటలు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పనిచేసే విలేజ్ క్లినిక్‌తో పాటు, మండలానికి రెండు పిహెచ్‌సిలు ఏర్పాటు చేసి
వాటికి అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పిహెచ్సిలో ఇద్దరు డాక్టర్లు
ఉంటారని, ఒక డాక్టర్ ఓపి చూస్తే, మరో డాక్టర్ 104 సంచార వైద్య శాలల్లో తనకు
కేటాయించిన గ్రామాలకు వెళ్తారని చెప్పారు. ప్రతి గ్రామంలో వైద్యులు అందుబాటులో
ఉంటారని చెప్పారు.
టీడీపీ హయంలో ఆరోగ్య శ్రీ నిర్వీర్యం….
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా నయం కాని సమస్యలను ఆరోగ్య శ్రీ
చికిత్సలకు రిఫర్ చేస్తారని చెప్పారు. విలేజ్ క్లినిక్‌లలో నయం కాని సమస్యలు
ఆరోగ్య ఆస్పత్రులకు పంపి చికిత్స అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు
వివరించారు.
ఆరోగ్య శ్రీ ఆలోచన వచ్చినపుడు ప్రతి ఒక్కరికి తట్టే పేరు రాజశేఖర్ రెడ్డిదని
జగన్ గుర్తు చేశారు. పేద వాడి ప్రాణాలు గాల్లో దీపాలు కాకుండా ఉండేందుకే
ఆరోగ్య శ్రీ, 108, 104 ఏ కార్యక్రమం అయినా పేదల సంక్షేమం కోసమే చేపట్టినట్టు
వివరించారు. చంద్రబాబు హయంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని కేవలం వెయ్యి జబ్బులకు
మాత్రమే పరిమితం చేశారని, వెయ్యి చికిత్సలకు పరిమితం చేయడంతో పాటు నెట్వర్క్
ఆస్పత్రులకు రూ.800కోట్లు బకాయిలు పెట్టారని జగన్ ఆరోపించారు. ఆరోగ్యశ్రీని
నీరుగార్చే పరిస్థితి నుంచి చెయ్యిపట్టుకుని పైకి లాక్కొచ్చామని చెప్పారు.
ఏపీలో భారీగా పెరిగిన ఆరోగ్య శ్రీ సేవలు…
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శ్రీ ఆస్పత్రులకు బకాయిలు మొత్తం తీర్చడమే
కాకుండా 3252 జబ్బులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. 919 ఆస్పత్రుల నుంచి
2261 ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ సేవలు విస్తరించినట్లు సిఎం తెలిపారు. ఎక్కడ
పేదలకు వైద్యం అందుతున్నా, వాటి ద్వారా పేదలకు మంచి జరుగుతున్నా, ఆరోగ్య
శ్రీలో ఎంపానెల్ చేసి వైద్యం అందిస్తున్నామని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో
కూడా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 35,71,596మంది ఆరోగ్య
శ్రీ ద్వారా చికిత్సలు పొందినట్లు చెప్పారు. నిరుపేద ప్రాణం, నిస్సహాయుల
ప్రాణాల విలువ తెలిసిన వారిగా, ఆరోగ్య శ్రీ మీద ఇప్పటి వరకు రూ. 9వేల కోట్ల
రుపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. మరో రూ.990కోట్లను ఆరోగ్య ఆసరా కోసం ఖర్చు
చేశామన్నారు. ఆరోగ్య శ్రీ కోసం ఇప్పటి వరకు రూ.10వేల కోట్లను ఖర్చు చేసినట్లు
ముఖ్యమంత్రి వివరించారు. గత ప్రభుత్వంలో ఏటా వెయ్యి కోట్లు కూడా చేయకపోతే
రూ.3300కోట్లను ఏటా ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
వైద్య ఆరోగ్య శాఖలో 48వేల ఉద్యోగాల భర్తీ….
వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ మీద చిత్తశుద్ధితో ప్రయత్నించామని,
వైద్యఆరోగ్య 46నెలల వ్యవధిలో 48,630 ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రజలు ఈ
మార్పుల్ని గుర్తించి ఆలోచించాలన్నారు. దేశం మొత్తం మీద చిన్న పిల్లల వైద్యుల
పోస్టులు 50శాతం ఖాళీలుగా ఉంటే, రాష్ట్రంలో ఒక్క పోస్టు కూడా జనరల్ ఫిజిషియన్
పోస్టులు ఖాళీగా లేవన్నారు. స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు దేశంలో 61శాతం
ఖాళీగా ఉన్నాయని, రాష్ట్రంలో మాత్రం 96శాతం భర్తీ అయ్యాయని వివరించారు.
రాష్ట్రంలో 3.96శాతం మాత్రమే స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల ఖాళీగా
ఉన్నాయన్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లు దొరక్క పోవడం వల్లే వాటిని పూర్తి
చేయలేక పోయామన్నారు. ప్రతి స్పెషలిస్ట్ డాక్టర్‌కు అడిగిన మేరకు జీతాలు
చెల్లించడానికి ముందుకు వచ్చి, నియామకాలు చేసినట్లు తెలిపారు. దేశంలోని ఏ ఒక్క
రాష్ట్రంలో లేని విధంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ 10,032ల ద్వారా
10,032మంది ఏఎన్ఎంలు, పిహెచ్సీ నర్సింగ్ సిబ్బందిలను నియమించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఆశా వర్కర్లకు రూ.3వేల నుంచి రూ.10వేల జీతం పెంచినట్లు చెప్పారు.
పట్టణ ప్రాంతాల్లో 560 అర్బన్ పిహెచ్సీలు, వాటిలో కూడా సిబ్బందిని
నియమించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ప్రతి 2500 జనాభాకు
ఓ ఆరోగ్య కేంద్రం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు.
చంద్రబాబు ఐదేళ్లలో రూ.8వేల కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం ఏటా రూ.18వేల
కోట్ల రుపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి
2019 వరకు ప్రభుత్వ రంగంలో 11మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే, కొత్తగా
15మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 5లక్షల లోపు
వార్షికాదాయం ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింప
చేస్తున్నామన్నారు.
చిలకలూరిపేటపై వరాల జల్లు….
చిలకలూరి పేట అభివృద్ధికి రూ.63కోట్లు అవసరమని మంత్రి రజని కోరడంతో వాటిని
మంజూరు చేస్తున్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అంబేడ్కర్ కమ్యూనిటీ
హాల్ నిర్మాణం, బీసీ భవన్, కాపు భవన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ముస్లిం స్మశాన వాటిక, దర్గా కోసం మూడెకరాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ను
ఆదేశించారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరమ్మతుల కోసం ప్రతిపాదనలు అంద
చేయాలన్నారు. వాటని కూడా వెంటనే మంజూరు చేస్తామన్నారు.