అమరావతి : ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి
గురికావడంపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి
వ్యక్తంచేశారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా
వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్సీపీ కాల్వలో పడిపోయిందని, ఈ
ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన
స్థలానికి పోలీసు సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు
చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి
వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు
తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా
నిలవాలన్నారు.