విజయవాడ : జ్యోతిరావు ఫూలే 196 వ జయంతిని పురస్కరించుకుని ఆర్టీసీ హౌస్ లో
నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిధులుగా సంస్థ ఛైర్మన్ ఏ. మల్లికార్జున రెడ్డి
ఎం.డి సిహెచ్. ద్వారకా తిరుమల రావు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన
చేసిన అనంతరం జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు
అర్పించారు. అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కే.ఎస్ బ్రహ్మానంద
రెడ్డి (ఆపరేషన్స్), ఏ. కోటేశ్వర రావు (అడ్మిన్ ) , పి. కృష్ణ మోహన్
(ఇంజినీరింగ్), ఫైనాన్షియల్ అడ్వైజరు రాఘవరెడ్డి లు నివాళులు అర్పించారు.
సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ) ఏ. కోటేశ్వర రావు ఈ కార్యక్రమానికి
అధ్యక్షత వహించారు. జ్యోతిరావు ఫూలే గొప్ప సంఘ సంస్కర్త అని, సమాజంలో మహిళలు
విద్యావంతులు కావాలని, అప్పుడే సమాజంలో వివక్ష తొలిగిపోతుందని నమ్మి ఆయన ఎంతో
పోరాటం చేసారని, మహిళలకు విద్య అవసరమని ఎలుగెత్తి చాటడమే కాకుండా, ఆ
రోజుల్లోనే మొదటి పాఠశాలను బాలికల కోసం స్థాపించిన మహానీయుడని వక్తలు
కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, దిగువ కులాల ప్రజలకు సమాన
హక్కులను పొందటానికి కృషి చేయడమే కాకుండా, తన అనుచరులతో కలిసి 1873 సెప్టెంబరు
24న, సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేసి, అన్ని
మతాల, కులాల ప్రజలు చేరవచ్చని ప్రకటించిన మహానీయుడని కీర్తించారు. ఇంకా ఈ
కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, బి.సి. వెల్ఫేర్
అసోసియేషన్ ప్రతినిధులు, మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ
అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొని వారి వారి సందేశాలను అందించారు. ఈ
కార్యక్రమంలో ఆర్టీసీ హౌస్ అధికారులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని
ఫూలేకి నివాళులు అర్పించారు.