న్యూఢిల్లీ : ఉగ్రవాదానికి ఆర్థిక తోడ్పాటే కీలక ఆధారమని, ఈ నేపథ్యంలో
టెర్రర్ ఫైనాన్సింగ్ నిర్మూలనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత
భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పేర్కొన్నారు. ఆయన మధ్య ఆసియా దేశాల
ఎన్ఎస్ఏలు, అధికారులతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మధ్య ఆసియాను
కీలక ప్రాంతంగా అభివర్ణించిన డోభాల్ అందులోని దేశాలకు భారత్ అత్యున్నత
ప్రాధాన్యం ఇస్తోందన్నారు. భారత్, మధ్య ఆసియా దేశాల మధ్య వాణిజ్యంతోపాటు
సంబంధాల బలోపేతంలో ప్రాంతీయ అనుసంధానత కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
‘ఉగ్రవాద ప్రచారం, నియామకాలు, నిధుల సేకరణ, సీమాంతర ఉగ్రవాదం, సైబర్ స్పేస్,
సాంకేతికతల దుర్వినియోగం, డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా,
తప్పుడు సమాచారం వ్యాప్తి వంటివి.. ఉగ్రవాద కట్టడి ప్రయత్నాలకు సవాళ్లుగా
ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి పరిష్కారానికి సమష్టి, సమన్వయ చర్యలు అవసరమని
సమావేశంలో పాల్గొన్న అధికారులు ఈ సందర్భంగా తీర్మానించారు. ఉగ్రవాద
కార్యకలాపాలకు అఫ్గాన్ స్వర్గధామంగా మారకుండా చూడాలని ఉద్ఘాటించారు. అయితే..
ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం జోక్యం చేసుకోకూడదని నిర్ణయించినట్లు
వెల్లడించారు.