విశాఖపట్నం : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం.. యువతకు పెద్ద
ఎత్తున ఉపాధి కల్పించటమే ప్రధాన లక్ష్యంగా ప్రపంచ పెట్టుబడిదారుల
సదస్సు – 2023ను నిర్వహించామని, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే
ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు
పెట్టేందుకు ముందుకొచ్చారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి
గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల
ఆకాంక్షలను నెరవేరుస్తూ విశాఖ వేదికగా రెండు రోజుల పాటు సాగిన గ్లోబల్
ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు.
సదస్సు ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన
మాట్లాడారు. కార్యక్రమం నిర్వహణకు సంబంధించి తీసుకొన్న నిర్ణయాలు, అనేక
సంస్థలు, అధికారులు చేసిన కృషి గురించి వివరించారు. సుహృద్భావ వాతావరణంలో
కార్యక్రమం సాగిందని దీనికి పారిశ్రామిక వేత్తల నుంచి రాష్ట్ర ప్రభుత్వం
నుంచి సంపూర్ణ సహకారం అందిందని గుర్తు చేశారు.
సదస్సు ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాం
మంత్రి మాట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023 పేరుతో రెండు రోజుల
పాటు నిర్వహించిన కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించామని
పేర్కొన్నారు. దీని ఫలితంగా సుమారు 352 ఎం.ఒ.యులు జరిగాయని, సుమారు 13
లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు. సదస్సులో జరిగిన
ప్రతి ఒప్పందాన్ని ఆచరణాత్మకంగా అమలు చేసి సత్ఫలితాలు సాధిస్తామని, వాటి
ద్వారా అందే ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలకు అందిస్తామని అన్నారు.
రాష్ట్రంలో పుష్కలంగా ఉన్న సహజ వనరులను సమృద్ధిగా వినియోగించి ఆర్థిక
పరిపుష్టిని సాధిస్తామని, పారిశ్రామిక వేత్తలకు పూర్తి స్థాయిలో సహకారం
అందించటం ద్వారా సంపదను సృష్టిస్తామని పేర్కొన్నారు. తద్వారా
భవిష్యత్తులో ఆరు లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి అమర్
నాథ్ ఉద్ఘాటించారు. ప్రధానంగా 14 రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించామని,
దీనికి అన్ని దేశాల నుంచి ఆశించిన మేర స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఈయూ
కూటమి దేశాల నుంచి అధిక సంఖ్యలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారని
గుర్తు చేశారు. యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, ఆస్ట్రేలియా దేశాల నుంచి
మొత్తం 40 దేశాలకు చెందిన 595 మంది ప్రతినిధులు పరోక్షంగా పాల్గొన్నారని
చెప్పారు.
కేంద్ర ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు సంతృప్తి
సదస్సు నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, తీవ్ర కృషి చేశామని
దీనికి తగిన ఫలితం దక్కిందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ
అమర్ నాథ్ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన
కేంద్ర ప్రతినిధులు, పలు దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, దేశంలోని
పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశంసించారని
గుర్తు చేశారు. రాష్ట్రం అందిస్తున్న సహాయ, సహకారాలపై
పారిశ్రామికవేత్తలు చాలా సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. సదస్సులో
పాల్గొన్న పారిశ్రామిక దిగ్గజాలు ముఖ్యమంత్రి చొరవను, రాష్ట్ర ప్రభుత్వం
అందిస్తున్న సహకారాన్ని గుర్తు చేసుకున్నారని మంత్రి ఈ సందర్భంగా
ఉద్ఘాటించారు.