భద్రాద్రి భూముల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం సహకరించాలి
దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
ప్రతీ ఆలయంలోనూ ఆధ్మాత్మిక శోభ వెల్లివిరిసేలా కార్యక్రమాలు
దేవాదాయ శాఖపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్ : ఆలయాల అభివృద్ధి, దేవాదాయ భూములు సంరక్షణతో పాటు ఆలయాలకు
వచ్చే భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు కలిపిస్తున్నామని దేవాదాయ శాఖ
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో శనివారం
డా.బీఆర్. అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆలయ భూముల
సంరక్షణ, ధూప దీప నైవేద్యం, కామన్ గుడ్ ఫండ్, ప్రత్యేక అభివృద్ధి నిధులపై
సమావేశంలో చర్చించారు. కొత్తగా చేపట్టిన ధూప దీప నైవేద్య పథకం వర్తింపు
ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కామన్ గుడ్ ఫండ్ నిధుల ద్వారా చేపట్టిన ఆలయాల అభివృద్ధి పనుల పురోగతిపై
ఆరా తీశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను దేవాదాయ వాఖ తరపున ఘనంగా
నిర్వహించాలని ఆధికారులను ఆదేశించారు. ప్రతీ ఆలయంలోనూ ఆధ్మాత్మిక శోభ
వెల్లివిరిసేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దశాబ్ది ఉత్సవాల
సందర్భంగా దేవాదాయ శాఖ నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలను
కమిషనర్ అనిల్ కుమార్ వివరించారు.
దేవాదాయ భూములను కబ్జా నుంచి విడిపిస్తాం : దేవాదాయ శాఖ భూముల లీజ్ రెంట్లు,
భూ రికార్డుల ప్రక్షాళన, ఆలయ భూముల వేలం ప్రక్రియలో పారదర్శకత, ఆయా ఆలయాల
పరిసరాల్లోని భూములు, స్థలాలు అన్యాక్రాంతం కాకుండా తీసుకుంటున్న చర్యలపై
అధికారులతో చర్చించారు. అన్యాక్రాంతమైన దేవదాయశాఖకు చెందిన భూములను తిరిగి
రాబట్టే విషయంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి చెప్పారు. స్పెషల్
డ్రైవ్ ద్వారా దశల వారీగా ఇప్పటి వరకు 6002 ఎకరాలను తిరిగి స్వాదీనం
చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ భూములకు సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసుల
విషయంలో ఆక్రమణదారులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు తగిన
సమాచారాన్ని కోర్టుల ముందుంచాలన్నారు. భూముల విషయంలో కోర్టు కేసుల ప్రగతి ఎలా
ఉందనే విషయంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు.
భద్రాద్రి ఆలయ భూములను సంరక్షణకు చర్యలు : ఆంధ్రప్రదేశ్ లోపి
పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర ఆలయ భూముల
సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు
చేస్తున్నామని అన్నారు. రామయ్య భూముల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం
సహకరించాలని మంత్రి కోరారు.
బాధ్యతయుతంగా పని చేయాలి : భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండే దేవాదాయ శాఖపై
లేని పోని అబద్ధాలతో బురదజల్లేందుకు ప్రతిపక్షాలు కాచుకు కూర్చున్నాయని, ఏ
చిన్న పొరపాట్లకూ తావివ్వకుండా బాధ్యతగా పనిచేయాలని ఎండోమెంట్ అధికారులను
ఆదేశించారు. ఆలయాల ఆదాయాన్ని ఆలయాల అభివృద్ధికే కేటాయిస్తున్నామని,
ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ప్రభుత్వమే ప్రధాన ఆలయాల అభివృద్ధికి
నిధులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు.
యాదాద్రిలో భక్తులకు వసతులు కల్పించాలి : భక్తులు క్యూ లైన్లలో ఎక్కువ
సమయం వేచి ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. క్యూ లైన్లు, ఆలయ
ప్రాంగణంలో వేచి ఉన్న అన్ని సమయాలలో భక్తులకు మంచినీరు అందించాలని మంత్రి
సూచించారు. అదేవిధంగా భక్తులు ఎండవేడిమి నుంచి సేద తీరేవిధంగా అవసరమైన చర్యలు
తీసుకోవాలన్నారు. వసతుల కల్పనలో ఆలస్యం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని
అధికారులను ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ
కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్లు జ్యోతి, కృష్ణవేణి, డిప్యూటీ
కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, స్తపతి వల్లినాయగం, ఈఈ, డీఈలు
పాల్గొన్నారు.