పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
గుంటూరు : ఇది మన పార్టీ అని భుజాన వేసుకుని ఆశయ బలంతో, త్రికరణ శుద్ధిగా పని
చేసే కార్యకర్తలే జనసేన బలం అని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం
చేశారు. జనసేన కోసం డబ్బు లేకుండా, ఏమీ ఆశించకుండా మనస్ఫూర్తిగా పని
చేస్తున్నారన్నారు. అలాంటి కార్యకర్తల కుటుంబాలకు ఏమైనా చేయాలని
ఆలోచించినప్పుడు రెండేళ్ల క్రితం క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించామని, క్లిష్ట
పరిస్థితుల్లో కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లగలిగామని
తెలిపారు. క్రియాశీలక సభ్యత్వాన్ని బీమా పథకంగా కాకుండా ఒక కోర్ ఓటు బ్యాంకుగా
భావించాలన్నారు. మనసు పెట్టి పని చేస్తున్న పార్టీ వాలంటీర్లని
ప్రోత్సహించాలని నాయకులకి సూచించారు. రాబోయే వారం రోజుల్లో కార్యక్రమాన్ని
మరింత చురుగ్గా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. బుధవారం సాయంత్రం పార్టీ
పీఏసీ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంఛార్జులు, వివిధ విభాగాల
అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్
నిర్వహించారు. క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియపై సమీక్షించి,
కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా దిశానిర్దేశం చేశారు.
క్రియాశీలక సభ్యత్వాన్ని పవిత్రమైన కార్యక్రమంగా భావించాలి : నాదెండ్ల
మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ
“క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను ఒక పవిత్రమైన కార్యక్రమంగా ముందుకు
తీసుకువెళ్లాలి. రాజకీయాల్లో ఎవరూ ఇటువంటి కార్యక్రమం చేపట్టలేదన్న విషయాన్ని
గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుల వారికి అంతా రుణపడి ఉంటాం. ఈ
ఏడాది కూడా ఈ మహత్తర కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రూ. కోటి విరాళం
అందించారు. ప్రతి జిల్లాలో కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత
ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 70 వేల మంది కొత్తగా క్రియాశీలక సభ్యులుగా చేరారు.
సోమవారం నుంచి అధ్యక్షుల వారి సూచన మేరకు అంతా సభ్యత్వాలు నమోదు చేసుకునే
అవకాశం కల్పిస్తున్నాం. నాయకులంతా క్షేత్ర స్థాయిలో పర్యటించి కార్యక్రమాన్ని
విజయవంతం చేయాలని తెలిపారు.