జగన్మోహన్ రెడ్డి ని నిలదీస్తేనే ఎస్సీలకు న్యాయం
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
గుంటూరు : మాలల్లో వచ్చిన చైతన్యంతో రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని
నమ్ముతున్నానని, ఇందిర, వైఎస్, జగన్ వెంటే మాలలు ఉన్నారనే ప్రచారానికి మీరే
చెక్ పెట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపిచ్చారు.
మంగళవారం మంగళగిరి టీడీపీ కార్యాలయం లో జరిగిన మాలల ఆత్మీయ సమావేశంలో
అచ్చెన్న మాట్లాడుతూ కొన్ని వర్గాల ఓట్లు తనకే పడతాయన్నది ఇప్పటికీ జగన్మోహన్
రెడ్డి ధైర్యమని, ఆ ధైర్యంతోనే అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. దళితులకు
అన్యాయం జరుగుతుంటే కొంతమంది దళిత నేతలే మాట్లాడకపోవటం బాధ కలిగిస్తోందన్నారు.
ప్రభుత్వం అండతోనే ఎస్సీలు, శిరోముండనాలు, హత్యలు, చిత్రహింసలకు
గురవుతున్నారని, దళిత మంత్రులు జగన్మోహన్ రెడ్డి ని నిలదీస్తేనే ఎస్సీలకు
న్యాయం జరుగుతుందని అన్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డిని నమ్మితే అంతా కలిసి
గోదాట్లో దూకటమేనని అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు మాల
పల్లెల్లో కుర్చీలు వేసేవారు కాదని., ఇప్పుడు కుర్చీలు వేసి కూర వండి, భోజనం
పెట్టి మరీ బాధలు చెప్తున్నారన్నారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసి జగన్
తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు. అంబేద్కర్‌కు భారత రత్న ఇచ్చింది
తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోనేనని, రాష్ట్రంలో కుల వివక్షను రూపుమాపటానికి
చర్యలు తీసుకుంది చంద్రబాబేనని స్పష్టం చేశారు. దళితులకు జనాభా ప్రాతిపదికన
అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించిన నాయకుడు చంద్రబాబని, సామాజిక
న్యాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు