పారదర్శకతతోనే విజయ కేతనం
తొమ్మిదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేసాం
ప్రభుత్వ పథకాల్లో సమూల మార్పులు
77వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బుజ్జగింపు రాజకీయాలనేవి దేశానికి 3
ప్రధాన శత్రువులని, వాటిని తుదముట్టిద్దామని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి
నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అభివృద్ధికి అతి పెద్ద శత్రువు అవినీతేనని
వ్యాఖ్యానించారు. మనం అభివృద్ధి కోరుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని
సహించకూడదని స్పష్టం చేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ లోని
ఎర్రకోటవద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన జాతినుద్దేశించి సుమారు
గంటన్నరపాటు ప్రసంగించారు. ప్రధాని రాజస్థానీ బాంధనీ ప్రింట్‌తో ఉన్న తలపాగా
ధరించారు. దేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించడానికి స్వాతంత్య్ర
సమరయోధులు చేసిన త్యాగం దగ్గరి నుంచి 9 ఏళ్లలో తమ ప్రభుత్వం చేస్తున్న
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాబోయే రోజుల్లో తీసుకురాబోయే
కొత్త పథకాల వివరాలను వెల్లడించారు. ఇదివరకు ప్రియమైన దేశ ప్రజలారా అని
సంబోధించిన ప్రధాని తాజా ప్రసంగంలో ప్రియమైన కుటుంబ సభ్యులారా అని దాదాపు
50సార్లు ప్రస్తావించారు. వచ్చే ఏడాదీ ఆగస్టున 15న ఎర్రకోటపై త్రివర్ణ
పతాకాన్ని ఎగురవేసి ప్రభుత్వం చేయబోయే పనులను ప్రకటిస్తానని ధీమా వ్యక్తం
చేశారు.
పారదర్శకతతోనే విజయ కేతనం : ‘2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా విజయ
కేతనం ఎగుర వేయాలంటే పారదర్శకత, నిష్పాక్షికత అవసరం. ఈ రెండింటికీ బలం
చేకూర్చడం మన బాధ్యత కావాలి. ప్రస్తుతం 3 రుగ్మతలపై పోరాడాల్సిన సమయం
వచ్చింది. ఈ దేశంలోని పేదలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, అమ్మలు,
అక్కలు, చెల్లెళ్లు అంతా తమ హక్కులను రక్షించుకోవడానికి ఈ మూడు రుగ్మతలను
తుదముట్టించాలి. సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతిని నిర్మూలించడానికి మేం
సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. తద్వారా 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను
ఏరేశాం. అవినీతిపరుల ఆస్తి జప్తు గతంలో కంటే 20 రెట్లు పెరిగింది’ అని మోదీ
తెలిపారు. ‘30 ఏళ్ల అనుభవాలను చవిచూసిన తర్వాత ప్రజలు పూర్తి మెజారిటీ ఉన్న
స్థిరమైన, బలమైన ప్రభుత్వం కావాలని భావించారు. అందుకే మాకు అవకాశం కల్పించారు.
వారిచ్చిన బలంవల్లే సంస్కరణలు సాధ్యమయ్యాయని మోడీ పేర్కొన్నారు.
తొమ్మిదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు : ‘తొమ్మిదేళ్ల పాలనలో దేశాభ్యున్నతి కోసం
ఎన్నో చేశాం. యువత నైపుణ్యాల కోసం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ ఏర్పాటు
చేశాం. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి జల్శక్తిశాఖను తెచ్చాం.
చేపల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మత్స్యశాఖ, పాడి పరిశ్రమను
ప్రోత్సహించడానికి పశు సంవర్ధక, డెయిరీశాఖ, సహకారోద్యమాన్ని విస్తరించడానికి
సహకారశాఖలను ఏర్పాటు చేశాం. ధరలను నియంత్రించడానికి మరిన్ని చర్యలు చేపడతాం.
ప్రజలపై భారం తగ్గిస్తాం. గ్రామాల్లోని 2 కోట్ల మంది అక్కచెల్లెమ్మలను
లక్షాధికారులను చేయాలనేది నా కల’ అని ప్రధాని వివరించారు.
ప్రభుత్వ పథకాల్లో సమూల మార్పు : ‘మేం అధికారంలోకి రాకముందు ప్రపంచంలో 10వ
స్థానంలో ఉన్న భారతీయ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు 5వ స్థానానికి తీసుకొచ్చాం.
పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.30 లక్షల
కోట్లు వెళ్లేది. గత 9 ఏళ్లలో ఇది రూ.100 లక్షల కోట్లకు చేరింది. ఇదివరకు
స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ.70వేల కోట్లు
ఖర్చు చేస్తే, ఇప్పుడు అది రూ.3 లక్షల కోట్లను మించిపోయింది. పేదల ఇళ్ల
నిర్మాణం కోసం రూ.4 లక్షల కోట్లు, రైతుల యూరియా సబ్సిడీకి రూ.10 లక్షల కోటు,
ముద్రా యోజన కోసం రూ.20 లక్షల కోట్లు, పీఎం స్వనిధి స్కీం కింద చిరు
వ్యాపారులకు రూ.50వేల కోట్లు అందించాం. ప్రభుత్వం తీసుకుంటున్న పేదల అనుకూల
విధానాలవల్ల 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. సాగర్మాల, పర్వతమాల,
భారత్‌మాల ద్వారా మౌలిక వసతులు పెంపొందించామని నరేంద్ర మోడీ వెల్లడించారు.