హైదరాబాద్ : రాహుల్ సందేశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్రంలో
హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు కాంగ్రెస్
నేతలు పేర్కొన్నారు. రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ యాత్ర కొనసాగుతుందని
తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఈ వేదికగా
ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో
కేసీఆర్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను హాత్ సే హాత్ జోడో కార్యక్రమం
ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్
మాణిక్‌రావు ఠాక్రే వెల్లడించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు
కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం
జరుగుతున్నట్లు చెప్పారు. రాహుల్ సందేశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా
ముందుకెళుతున్నట్లు ఆయన వివరించారు. మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్ రెడ్డిల
అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో హాత్ సే హాత్ జోడో యాత్ర
ప్రధాన అజెండాగా చర్చించారు. ఈ సందర్భంగా ఈ నెల 6న మొదలయ్యే జోడో యాత్రలో
ప్రతి నియోజకవర్గంలో ప్రతి నాయకుడు పాల్గొంటారని మాణిక్‌రావు పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదని, కోడిగుడ్డు మీద ఈకలు
పీకే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్‌కు ప్రజలు,
ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదన్న ఆయన వారికి ఇవే చివరి ఎన్నికలన్నారు.
ఫిబ్రవరి 6న ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ నుంచి హాత్ సే హాత్ జోడో
అభియాన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. మండల పార్టీ కమిటీలు రద్దయినట్లు గతంలో
ప్రకటించామని, ఇప్పుడు అవే కమిటీల నేతృత్వంలో జోడో యాత్ర కొనసాగుతుందని
స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి కొత్త కమిటీలు వేసే వరకు ఇవే పని చేస్తాయని
స్పష్టం చేశారు.”మేడారం నుంచి హాత్ సే హాత్ జోడో అభియాన్ ప్రారంభం అవుతుంది. కాంగ్రెస్‌పై
ప్రజల్లో విశ్వాసం పెంచేందుకే ఈ యాత్ర. బీజేపీ, బీఆర్ఎస్ విధానాలన్నీ ఒక్కటే.
ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తుంటే ఇద్దరూ కలిసి డ్రామాకు తెరలేపారు. గవర్నర్
పచ్చి అబద్ధాలతో కేసీఆర్‌ను అసెంబ్లీలో పొగిడారు. కేసీఆర్‌కు ప్రజలు,
ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.