సాంఘిక శాస్త్రం ఒక్కటే రాష్ట్ర సిలబస్
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-7 తరగతులకు సీబీఎస్ఈ సిలబస్‌కు అనుగుణంగా
పాఠ్య పుస్తకాలు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతిలో అమలు చేస్తుండగా
ఇక మొత్తం అన్ని తరగతులకు సీబీఎస్ఈ పుస్తకాలనే అందించాలని పాఠశాల విద్యాశాఖ
నిర్ణయించింది. 1 – 7 తరగతులకు గణితం, ఆంగ్ల పాఠ్యపుస్తకాలు, 6, 7 తరగతులకు
సామాన్యశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి కొత్త పుస్తకాలు ఇస్తారు. సాంఘిక
శాస్త్రం మాత్రం రాష్ట్ర సిలబస్ ఇస్తారు. ఇందులో ఏపీ చరిత్ర ఉంటుంది.
సీబీఎస్ఈ సిలబస్‌లో దేశ చరిత్ర మాత్రమే ఉంటుంది. అందుకే సాంఘిక శాస్త్రం వరకు
రాష్ట్ర సిలబస్ పుస్తకం ఇవ్వనున్నారు. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి
(ఎన్సీఈఆర్టీ) పాఠ్య పుస్తకాలను సీబీఎస్ఈ అనుసరిస్తుంది. ఎనిమిదో తరగతి
నుంచే సీబీఎస్ఈ ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలను రూపొందిస్తోంది. కింది తరగతులకు
సిలబస్‌ను సూచిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఎన్సీఈఆర్టీ సూచించిన
సిలబస్ ఆధారంగా పాఠ్య పుస్తకాలను అందిస్తారు. వచ్చే ఏడాది తొమ్మిదో తరగతికి
వీటినే అందిస్తారు. రాబోయే రోజుల్లో అన్ని తరగతులకు సీబీఎస్ఈ పుస్తకాలు
ఇచ్చినా బోర్డు అనుమతి లేని బడుల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం రాష్ట్ర
బోర్డే పరీక్షలు నిర్వహిస్తుంది. సీబీఎస్ఈ సిలబస్ చదివినా రాష్ట్ర బోర్డు
పరీక్షలే రాయాల్సి ఉంటుంది. కరిక్యులమ్ పునఃసమీక్షపై నిర్వహించిన సమావేశంలో
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విద్యా సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని
ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈనెల 21
నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణీ
చేస్తామని తెలిపారు. అనంతరం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ
2020-21 నుంచి దశలవారీగా పాఠశాలలను సీబీఎస్ఈతో అనుసంధానం చేయడం వల్ల 8, 9
తరగతుల పాఠాలను ముందు తరగతి పాఠ్యాంశాలకు అనుసంధానం చేస్తున్నామని
వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ మాజీ వీసీ వెంకటరామిరెడ్డి, సమగ్ర
శిక్ష అదనపు రాష్ట్ర పథక సంచాలకుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు.