వారంలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
జులై 8న నాన్న జయంతి రోజు ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం
ఇవాళ్టి నుంచి ఈ ప్రాంతం సామాజిక అమరావతి
గుంటూరు : రాజధాని పరిధిలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలకు వారం
రోజుల్లోనే బీజం వేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
చెప్పారు. అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభ
కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మౌలిక వసతులన్నీ కల్పిస్తూ లబ్ధిదారులకు ఇంటి
పత్రాలు అందజేస్తామన్నారు. ఇవాళ్టి నుంచి ఈ ప్రాంతం సామాజిక అమరావతి అవుతుందని
చెప్పారు. మహిళల పేరుతో ఇళ్ల పట్టాలన్నీ ఇస్తున్నాం. జులై 8న నాన్న జయంతి రోజు
ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం. ఇళ్లు ఎలా కట్టుకోవాలనే విషయంపై లబ్ధిదారులకు
మూడు ఆప్షన్లు ఇస్తాం. పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం తాపత్రయ పడుతోంది. కొంతమంది
దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ
ప్రత్యేకత ఉంది. పేదల కోసం కోర్టుల్లోనే పోరాడి విజయం సాధించాం. ఇళ్ల స్థలాల
పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చే హక్కులే కాదు..సామాజిక, న్యాయ పత్రాలు. ఇవాళ్టి
నుంచి ఇదే అమరావతి ఒక సామాజిక అమరావతి, మనందరి అమరావతి అవుతుంది. ప్రతి లేఔట్
వద్దకు లబ్ధిదారులను తీసుకెళ్లి అక్కడే ఫొటో తీసుకుంటాం. మరో వారం రోజులు ఈ
పండగ కార్యక్రమం కొనసాగుతుందని జగన్ అన్నారు.
దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు
వద్దని కోర్టులకెక్కి అడ్డుకున్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వమే
న్యాయపోరాటం చేసింది. ఇది పేదల విజయం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. శుక్రవారం అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ
కార్యక్రమంలో భాగంగా వెంకటపాలెం బహిరంగ సభ నుంచి సీఎం జగన్ ప్రసంగించారు.
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేదల
కోసం న్యాయ పోరాటం చేశాం. విజయం సాధించాం. ఇప్పుడు రూ. ఏడు లక్షల నుంచి 10
లక్షల విలువ చేసే ఇంటి స్థలం.. అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్
చేస్తున్నాం. అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి
అవుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నా అని అన్నారు. ఇవి ఇళ్ల పట్టాలే కాదు..
సామాజిక, న్యాయ పత్రాలు కూడా. సామాజిక అమరావతే.. మనందరి అమరావతి. 50, 793 మంది
పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నాం. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో
మొత్తం 25 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వారం పాటు ఇళ్ల పట్టాల పండుగ
కార్యక్రమం ఉంటుందని, ఇళ్లు కట్టడానికి బీజం కూడా ఈ వారంలోనే పడుతుందని అని
సీఎం జగన్ ప్రకటించారు. దివంగత మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా జులై 8వ
తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే
లే అవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని, జులై 8వ తేదీ లోగా జియో
ట్యాగింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు మూడు ఆప్షన్లు
ఉంటాయని సీఎం జగన్ వెల్లడించారు. సొంతంగా ఇళ్లు కట్టుకుంటే రూ. లక్షా 80 వేలు
బ్యాంకు ఖాతాల్లో వేస్తాం. రెండో ఆప్షన్లో నిర్మాణ కూలీ మొత్తాన్ని జమ
చేస్తాం. ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుంది. స్టీల్,
సిమెంట్, డోర్ ఫ్రేమ్లు సబ్సిడీపై అందిస్తాం. మెటీరియల్ నాణ్యత విషయంలో
రాజీ పడేది లేదని సీఎం జగన్ ప్రకటించారు.