ఉద్యమ ఫలితంగానే 37 డిమాండ్లు సాధించాం
సీపీఎస్ రద్దు…ఓపీఎస్ అమలు కోసం తొలి నుంచి పోరాడింది తామే
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
గుంటూరు రెవెన్యూ కల్యాణ మండపంలో ఏపీ జేఏసీ నాలుగో ప్రాంతీయ సదస్సు
గుంటూరు : పాత పింఛను విధానం అమలుకు ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఏపీ జేఏసీ
అమరావతి ఉద్యోగుల సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. 37
డిమాండ్లు సాధించినందున ఉద్యమం విరమిస్తున్నట్టు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల
సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గుంటూరు రెవెన్యూ
కల్యాణ మండపంలో నిర్వహించిన ఏపీ జేఏసీ నాలుగో ప్రాంతీయ సదస్సుకు ఆయన
ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బొప్పరాజు
మాట్లాడుతూ పాత పింఛను విధానానికే ఏపీజేఏసీ అమరావతి కట్టుబడి ఉందన్నారు. పాత
పింఛను విధానం అమలుకు ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్
రద్దు, ఓపీఎస్ అమలు కోసం తొలి నుంచి పోరాడింది తామేనని చెప్పారు. పాత
పింఛనుపై హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనన్న బొప్పరాజు మళ్లీ చలో విజయవాడ
పునరావృతం కాకూడదని ప్రభుత్వానికి చెప్పామని స్పష్టం చేశారు. ఉద్యోగుల
సమస్యలపై ఈ ప్రభుత్వానికి ఇచ్చిన సమయం గతంలో ఏ ప్రభుత్వానికీ ఇవ్వలేదన్నారు.
92 రోజులుగా అలుపెరగని పోరాటం చేశామని, ఉద్యమ ఫలితంగానే చాలా డిమాండ్లు
సాధించామని బొప్పరాజు చెప్పారు.
ఇక ఉద్యమాన్ని విరమిస్తున్నాం : ఉద్యమం చేయకపోతే ఉద్యోగుల ప్రయోజనాలు ఉండవని
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన
మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా చాలా సమయం
ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఫిబ్రవరిలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరినా అమలు
చేయలేదని, ఒప్పందాలు అమలు చేయకపోగా దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం
వాడుకుందని మండిపడ్డారు. 92 రోజుల పాటు ఉద్యమం చేసి హక్కులు సాధించుకున్నామని
తెలిపారు. అన్ని సమన్వయం చేసుకుంటూ నల్ల బ్యాడ్జీలతో ఉద్యమించామన్నారు. 26
జిల్లాలలో ఒకేసారి ఉద్యమం ప్రారంభించామని చెప్పారు. కారుణ్య నియామకాలు ఉద్యమ
ఫలితమే అని తెలిపారు. గ్రామ సచివాలయాలలో ఉద్యోగుల టార్గెట్ రద్దు చేశారని,
ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుందని ఆయన
విమర్శించారు.
ఉద్యమ ఫలితంగా పోలీసుల టీఏ విడుదల చేశారన్నారు. 4 డీఏలు ప్రభుత్వం బాకీ
ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని ప్రభుత్వం
చెప్పిందని, మన కోరికలు వేరు ప్రభుత్వ ఆలోచన వేరన్నారు. వైద్యవిధాన పరిషత్
ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులర్ చేసిందన్నారు. 62 సంవత్సరాల రిటైర్మెంట్
ఉద్యోగులు అడగలేదని, రాష్ట్ర అర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం
రిటైర్మెంట్ ఏజ్ పెంచిందన్నారు. పాత పెన్షన్ విధానం కోసం పోరడతామని స్పష్టం
చేశారు. ఉద్యమాలు చేయడానికి మిగతా సంఘాలు కలసి రావని, పైగా తమ సంఘాన్ని
ఆడిపోసుకుంటున్నారన్నారు. పాత పెన్షన్ విధానం అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం
ఆర్థికంగా దెబ్బతింటుంది అనడం అర్థ రహితమన్నారు. వాట్సప్ ఉద్యమం ద్వారా ఏమీ
సాధింలేమన్నారు. 47 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచితే 32 డిమాండ్లు
పరిష్కరించిందన్నారు. ఈ ఉద్యమాన్ని ఇక విరమిస్తున్నామని చెప్పారు. తీవ్రంగా
నష్టపోయింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని, త్వరలోనే అవుట్ సోర్సింగ్ సమస్య
పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ఇక అమరావతి జేఏసీ అవుట్
సోర్సింగ్ ఉద్యోగుల కోసం పోరాటం చేస్తామన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి,
ఏపీ చీఫ్ సెక్రటరీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిజేశారు. రాష్ట్రంలో 4 లక్షల
మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.