తిరుపతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్
లైన్ టికెట్లు బుధవారం నుంచి తిరుపతి లోనే మంజూరు చేస్తున్నారు. మాధవం
అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను జేఈవో వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా
పూజలు చేసి ప్రారంభించారు. గుంటూరుకు చెందిన ఎన్ లక్ష్మి హరీష్, జి.రూప సింధు
కు జేఈవో తొలి టికెట్ అందించారు. అనంతరం వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ,
శ్రీవాణి ట్రిస్టు కు రూ 10 వేలు విరాళం ఇచ్చి రూ 500 చెల్లించే భక్తులకు
ఇప్పటి దాకా తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తున్నారని చెప్పారు. దాతలు
ముందురోజు తిరుమలకు వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన
పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రక్రియలో దాతలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గుర్తించి
టీటీడీ యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి ఇక్కడే
వారికి వసతి గదులు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనివల్ల
భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ కు సమీపంలో
ఉన్న మాధవం గెస్ట్ హౌస్ నుంచి ఉదయాన్నే బయలు దేరి తిరుమలకు వెళ్ళవచ్చు
నన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో పురాతన ఆలయాల అభివృద్ధి,
జీర్ణోద్ధరణ, కొత్తగా ఆలయాలు, భజన మందిరాలు నిర్మిస్తున్నామని శ్రీ వీరబ్రహ్మం
తెలిపారు. ఈ ట్రస్టు ద్వారా తొలివిడత లో తెలుగు రాష్ట్రాల్లో 502 ఆలయాలు
నిర్మించామన్నారు. రెండో విడతలో సుమారు 1500 ఆలయాల నిర్మాణాలకు అనుమతులు
మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. శ్రీవాణి ట్రస్టు కు విరాళం ఇచ్చే భక్తులు
తిరుపతిలోని మాధవం అతిథిగృహం లో ఏర్పాటు చేసిన కౌంటర్లను సద్వినియోగం
చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన యూనియన్ బ్యాంకు
యాజమాన్యానికి జేఈవో కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు,
యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ శ్రీ రాం ప్రసాద్, చీఫ్ మేనేజర్లు బ్రహ్మయ్య ,
నగేష్ కుమార్ , విజివో మనోహర్, డిప్యూటీ ఈవో పార్వతి, ఈఈ కృష్ణారెడ్డి,
ఏఈవో ధనుంజయులు పాల్గొన్నారు.