కిలో ప్యాకెట్ రూ.16లు
విశాఖపట్నం : పేదల కడుపు నింపే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
మరో అడుగు ముందుకు వేసింది.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకూ బియ్యం, చక్కెర,
కందిపప్పు సరఫరా చేస్తోన్న పౌరసర ఫరాల శాఖ బుధవారం నుంచి గోధుమ పిండి కూడా
అందిస్తోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ
కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ప్రారంభించారు. నగరంలోని లబ్దిదారులకు గోధుమ
పిండి ప్యాకెట్ లను పంపిణీ చేశారు. ఒక్కో కార్డు పై రెండు కిలోల వంతున కిలో
ప్యాకెట్లను రెండింటిని మంత్రి లబ్దిదారులకు అందించారు. గోధుమ పిండి కిలో
ప్యాకెట్ ధర 16 రూపాయలుగా నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఎపిలో ప్రజా పంపిణీ
వ్యవస్థ పనితీరు భేష్ అని ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా కేంద్ర పిడిఎస్
కార్యదర్శి మెచ్చుకున్న విషయం విదితమే. పేద వర్గాలకు మరింత మేలు చేయాలన్న
లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తుండగా
ఆయన అడుగుజాడల్లో మంత్రి కారుమూరి నడుస్తున్నారు.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, మన్యం, అనకాపల్లి
మునిసిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ పై గోధుమ పిండి
అందించనున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.40 గా ఉంది. విశాఖపట్నం అర్బన్
ఏరియా వార్డ్ నెంబర్ 24, సీతమ్మధార నందు రేషన్ షాపు నెంబర్ 205 పరిధిలో రేషన్
కార్డు దారులకు యం. డి.యు. వాహనం ద్వారా గోధుమ పిండి పంపిణీ చేశారు. ఈ
కార్యక్రమమంలో రాష్ట్ర నెడ్కాప్ అధ్యక్షుడు కె. కె.రాజు, స్థానిక
కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ ,
జిల్లా పౌరసఫరాల అధికారి జి.సూర్యప్రకాశ్ రావు, జిల్లా పౌరసరఫరాల సంస్థ
మేనేజర్ ఐ.రాజేశ్వరి, రేషన్ డిపో డీలర్ల సంఘం అధ్యక్షుడు చిట్టిరాజు,
వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పౌసరఫరాలశాఖ
మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం లోని 6,94,755 కార్డు దారులకు ప్రస్తుతం
గోధుమపిండి పంపిణీ చేస్తుండగా ఒక్క విశాఖపట్నం జిల్లాలో 4,54,485
కార్డుదారులకు పంపిణీ చేయనున్నామని లబ్ది దారులు ఈ అవకాశం వినియోగించుకోవాలని
కోరారు. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలో గల కార్డు దారులకు సబ్సిడీ పై
గోధుమపిండి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.