రవాణా శాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనలకు ఆమోదం
అమరావతి : ఏపీలో రోడ్డు ప్రమాదానికి గురైన ఇతర రాష్ట్రాల వ్యక్తులకూ డాక్టర్
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందనుంది. రాష్ట్రంలో ఏటా
రోడ్డు ప్రమాదాల కారణంగా 8,000 మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాలు,
మరణాలను 15 శాతం తగ్గించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 14న సీఎం వైఎస్ జగన్
అధ్యక్షతన ఏపీ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగ్లో నిర్ణయించారు. రాష్ట్రంలో
రోడ్డు ప్రమాదానికి గురవుతోన్న ఇతర రాష్ట్రాలకు చెందిన డ్రైవర్లు, రోజువారీ
కూలీలు, ప్రయాణికులకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులను
సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద ఇతర రాష్ట్రాల రోడ్డు ప్రమాద బాధితులకు
చికిత్సలు అందించేలా చూడాలని సూచించారు. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ పంపిన
ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఆరోగ్యశ్రీ కింద ఇతర రాష్ట్రాల రోడ్డు ప్రమాద
బాధితులకు ఉచిత చికిత్స అందించడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ
కృష్ణబాబు మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో రోడ్డు
ప్రమాదాలకు గురయ్యే ఇతర రాష్ట్రాల వ్యక్తులకు సీఎంసీవో కార్డును జారీ చేయడం
ద్వారా నగదు రహిత చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో
అందించనుంది. ఇందుకోసం అవసరమైన చర్యలను చేపట్టాలని ఆరోగ్యశ్రీ సీఈవో, రవాణా
శాఖ కమిషనర్లను ఆదేశించారు.